న్యాయం కోసం ప్రియురాలి ఆందోళన

21 May, 2016 15:49 IST|Sakshi
బంధువుతో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన బాధితురాలు

హైదరాబాద్: పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడం తో ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిందో యువతి. హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. తుర్కయంజాల్‌కు చెందిన ఉమామహేశ్వరి  (22) బీఈడీ మొదటి సంవత్సరం చదువుతోంది. వరుసకు బావ అయిన బ్రాహ్మణపల్లికి చెందిన గుర్రం సుధీర్‌రెడ్డి ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని ఆరు నెలలుగా ఆమెను వెంట తిప్పుకున్నాడు. తన చెల్లెలి పెళ్లి అయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెకు చెప్పాడు. సోదరి పెళ్లి అయ్యాక మా ఇంట్లో ఒప్పుకోవడంలేదని ముఖం చాటేశాడు.

దీంతో ఉమామహేశ్వరి ఈ నెల 5న ఆదిభట్ల ఠాణాలో గుర్రం సుధీర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి యువతి జీవితాన్ని పాడుచేయొద్దని హెచ్చరించారు. మూడు రోజుల సమయం కావాలని అతని తల్లిదండ్రులు పోలీసులను కోరారు. ఆ తర్వాత ఎలాంటి ఫలితంలేకపోవడంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించగా...‘ సుధీర్‌రెడ్డి సైకో, అతడి ప్రవర్తన బాలేదు. బాగా చదువుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకో’ అని సలహా ఇచ్చి పంపేశారు. దీంతో నిరాశ చెందిన బాధితురాలు ఎన్నోసార్లు ఆత్మహత్యకు యత్నించగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు.

ప్రియుడి ఇంటి ముందు ఆందోళన....

సుధీర్‌రెడ్డే సర్వస్వం అనుకున్నానని, అతడితోనే తన చావైనా, బతుకైనా అంటూ ఉమామహేశ్వరి  శుక్రవారం ఉదయం నుంచి  ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలిసి హయత్‌నగర్ సీఐ నరేందర్‌గౌడ్ ఘటనా స్థలానికి వచ్చారు. యువతితో మాట్లాడిన ఆయన గ్రామసర్పంచ్ సమక్షంలో కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా, ప్రియురాలి ఆందోళన విషయం తెలిసి ప్రియుడు సుధీర్‌రెడ్డి రహస్య ప్రాంతంలో తలదాచుకోవడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు