మందు కొట్టి... బైక్‌ను ఢీకొట్టి..

19 Mar, 2018 00:35 IST|Sakshi

యువతి ర్యాష్‌ డ్రైవింగ్‌

యాక్టివాను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టిన కారు

చికిత్స పొందుతూ బోరబండవాసి మృతి, మరొకరి పరిస్థితి విషమం

హైదరాబాద్‌: స్నేహితులతో కలసి కారులోనే పార్టీ చేసుకుని, మద్యం సేవించారు. అదే మత్తులోనే ఓ యువతి మితిమీరిన వేగంతో కారు నడిపింది. దీంతో కారు అదుపు తప్పి యాక్టివాను ఢీకొట్టింది. శనివారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యాక్టివాపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు బోర బండకు చెందిన రామాయణం చిరంజీవి(20)గా, క్షతగాత్రుడు రామనాతి సాయికుమార్‌(20)గా పోలీసులు గుర్తించారు.

ప్రమాదానికి కారకురాలైన న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్‌(26)ను అదుపులోకి తీసుకుని, బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేయగా 51 శాతం బీఏసీ రీడింగ్‌ నమోదైందని పోలీసులు చెప్పారు. ఆదివారం రాయదుర్గం ఎస్‌ఐ నదీమొద్దీన్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్, లీజా.. మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ కోకాపేట్‌లోని బ్లాసమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

శనివారం స్నేహితుడు రవనీత్‌ సింగ్‌ను కలిసి.. రాత్రి జూమ్‌కార్‌లో క్రెటా కారును అద్దెకు తీసుకొని కారులోనే పార్టీ చేసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు లీజాతో కలసి కారు నడుపుకుంటూ మాదాపూర్‌ నుంచి నిర్మాణంలో ఉన్న టీహబ్‌ మీదుగా రాయదుర్గం వైపు వెళుతున్నారు. మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్‌ కారును మితిమీరిన వేగంతో నడుపుతూ బయోడైవర్సిటీ వద్ద హోండా యాక్టివాను ఢీకొట్టింది. ఆ బైక్‌పై ఉన్న చిరంజీవి, సాయికుమార్‌ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందాడు. మాదాపూర్‌లోని జుమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న చిరంజీవి రోజూమాదిరిగానే విధులు ముగించుకొని స్నేహితుడు సాయికుమార్‌తో కలసి యాక్టివాపై గచ్చిబౌలి నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న సాయికుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఉన్న ఒక్క కుమారుడు చిరంజీవి మృతి చెందడంతో రామాయణం శ్రీనివాస్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

పల్టీలు కొట్టిన కారు....
మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్‌ మితిమీరిన వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ను ఢీ కొట్టిన అనంతరం కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. క్రేటా కారులో బెలూన్‌ ఓపెన్‌ కావడంతో జెన్నీ, లీజాకు గాయాలు కాలేదు. కారులో బీరు సీసాలు, చికెన్‌ లెగ్‌ పీస్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నదీమొద్దీన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు