మహిళ కడుపులో కత్తెర..!

22 Jun, 2016 23:25 IST|Sakshi
మహిళ కడుపులో కత్తెర..!

- శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు
- కోలుకుంటున్న బాధితురాలు
 
 హైదరాబాద్: తీవ్రమైన కడుపునొప్పితో ఓ మహిళ నెల రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరికి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అయితే వైద్యులు ఆమె కడుపులో ఆరు అంగుళాల కత్తెర భాగాన్ని గుర్తించారు . 12 మంది వైద్యుల బృందం సుమారు రెండు గంటలు శ్రమించి దానిని బయటకుతీసింది.  కాగా తన కడుపులోకి కత్తెర ఎలా వచ్చిందో తెలియదని సదరు మహిళ చెప్పడం గమనార్హం. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన స్వప్న(30), హుస్సేన్ భార్యాభర్తలు. కూలి పనులు చేస్తు జీవనం కొనసాగిస్తున్న వీరికి నలుగురు పిల్లలు. నెలరోజులుగా స్వప్న తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత చూపించుకుంది. వైద్యుల సూచన మేరకు పటాన్‌చెరులోని మరో ఆస్పత్రిలో చేరింది.

అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 11న గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఎక్స్‌రేతోపాటు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వప్న కడుపులో ఆరు అంగుళాల ఇనుప వస్తువును గుర్తించారు. శస్త్రచికిత్స లేకుండా ఇనుప వస్తువును బయటకు తెచ్చేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. మలవిసర్జనతోపాటు అది బయటకు వచ్చేలా తొలుత తగిన వైద్యం(ఎనిమా) అందించారు. అయితే కడుపులో ఉన్న వస్తువు అడ్డం తిరిగింది. ప్రతిరోజు తీసిన ఎక్స్‌రేల్లో కడుపులోని పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చింది.

పదునైన ఇనుప వస్తువు కావడం.. అది అడ్డంగా తిరగడంతో నరాలు, ప్రేగులకు గుచ్చుకుంటే ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు.. ఈ నెల 17న శస్త్రచికిత్స నిర్వహించి మహిళ కడుపు నుంచి  కత్తెర భాగాన్ని విజయవంతంగా బయటకు తీశారు. ఇదిలా ఉండగా తన కడుపులోకి కత్తెర భాగం ఎలా వచ్చిందో తెలియదని స్వప్న ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే కొద్దినెలలుగా మానసిక రుగ్మతలకు గురైన స్వప్న కత్తెర భాగాన్ని మింగి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, స్వప్న కోలుకుంటోందని, త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జేవీ రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు పీవీ చలం, కృష్ణమోహన్, రాజ్‌కరణ్, సిద్దిపేట రమేష్, శ్రీదేవి, పీజీలు ప్రవీణ, స్వప్న, సునీత, హిమజ, చంద్రారెడ్డి, అష్‌లేష్, సింధూరలను ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు