వనితకు వరం.. ‘వీ హబ్‌’

9 Mar, 2018 01:23 IST|Sakshi
గురువారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కంపెనీల ప్రతినిధులతో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న జయేశ్‌ రంజన్‌

రూ.15 కోట్లతో నిధి.. మహిళలకు ప్రత్యేక రాయితీలు

రూ.25 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి సాయం

సాక్షి, హైదరాబాద్‌ :  ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వరమిచ్చింది. కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ఇప్పటికే టీహబ్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీహబ్‌ (ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ హబ్‌) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీ హబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు.

ఈ వీ హబ్‌ ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. వీహబ్‌కు కొత్త ఆలోచనలతో వచ్చే మహిళలకు అక్కడే యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వడంతోపాటు పెట్టుబడి కోసం రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు సాయాన్ని అందజేయనుం ది. దీనికి తొలుత ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను వీహబ్‌కు తెలియజేయాలి. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించిన అనంతరం పారిశ్రామిక రంగంలో పేరొందిన నిపుణుల ఆధ్వర్యంలో వారికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ మేరకు వీహబ్‌ ఆరు ప్రముఖ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.

ప్రభుత్వమే తొలి కొనుగోలుదారు
‘ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. తొలుత రూ.15 కోట్లతో ప్రారంభిస్తున్నాం. విడతల వారీగా అభివృద్ధి చేస్తూ భారీగా నిధులు కేటాయిస్తాం. ప్రతి మహిళను విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తయారుచేయడమే వీ హబ్‌ లక్ష్యం’ అని కేటీఆర్‌ తెలిపారు. వీహబ్‌ ప్రారంభించిన అనంతరం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘మహిళలకు వినూత్న ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టాలంటే ప్రోత్సాహం అంతంతమాత్రంగానే దక్కుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభు త్వం వీ హబ్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసిం ది. ఆలోచన వస్తే వెంటనే వీహబ్‌లో సంప్రదించండి. నిపుణులతో అవగాహన కల్పించి మార్గనిర్దేశనం చేస్తాం. ఉత్తమ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతాం. వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వమే తొలుత కొనుగోలు చేస్తుంది. టీ హబ్‌ ద్వారా ఇప్పటికే వేలాది మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. వీ హబ్‌ ఆలోచన ఇదివరకే చేసినప్పటికీ మంచిరోజున ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించాం’ అని అన్నారు.


చరిత్ర సృష్టిస్తున్నారు..
‘క్రీడా రంగంలో మన హైదరాబాదీ అమ్మాయిలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మిథాలీరాజ్, అరుణారెడ్డి సరి కొత్త చరిత్ర సృష్టించారు. వ్యాపారంలో సరికొత్త కాన్సెప్ట్‌ ‘పెళ్లి జడలు’పేరుతో వ్యాపారం ప్రారంభించిన కల్పన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ వీహబ్‌ అండగా ఉంటుంది’అని అన్నారు.

చాలా కుటుంబాల్లో తమ పిల్లల్ని డాక్టర్, ఇంజనీరు చేయాలని అనుకుంటున్నారని, కానీ అత్యుత్తమ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే దిశగా ఆలోచించడం లేదన్నారు. కేటీఆర్‌ ప్రసంగానికి ముందు పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో ప్రాజెక్టు సంచాలకులు టెస్సీ థామస్, ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు కోల వాణి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు