ఆమె అడవిని జయించింది..

3 Mar, 2015 23:19 IST|Sakshi
ఆమె అడవిని జయించింది..

నగర మహిళలు మోడరనే కాదు... ఫియర్‌లెస్ కూడా. ఎత్తై గుట్టల్ని అవలీలగా ఎక్కేస్తూ.. ఎంతటి కష్టమైనా సరే ఈజీగా విజయాన్ని చేజిక్కించుకోగలమని చాటుతున్నారు. నదీ జలాల్ని సునాయాసంగా దాటేస్తూ... జీవితాన్నే ఎదురీదుతున్న తమకు ఇదో లెక్కకాదని నిరూపిస్తున్నారు. ట్రెక్కింగ్, రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్... సాహసంగానో, ప్రత్యేక గుర్తింపు కోసమో కాదు కేవలం అభిరుచిగా మాత్రమే చేస్తున్నారు.  ఆటవిడుపు కోసం అడవులను ఎంచుకుని, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తున్న కొందరు మహిళల గురించి...
 వాంకె శ్రీనివాస్
 
 ఒకప్పుడు మహిళ ఆసక్తులంటే... సంగీతం, నృత్యం, పుస్తక పఠనం, కుట్లు, అల్లికలు, రకరకాల వంటల తయారీ. అతి కొద్ది మంది మాత్రమే వీటికి భిన్నంగా నడిచేవారు. జనరేషన్ మారింది. ఇప్పుడలా కాదు. చిన్నతనం నుంచే ప్రత్యేకంగా ఉండే హాబీలను ఎంచుకునే వారు కొందరైతే... ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నుంచి విశ్రాంతి పొందేందుకు వినూత్న ప్రయోగాలు చేయాలనుకునేవారు మరికొందరు. ఈ ఆలోచనలే ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రాఫ్టింగ్ వంటి సాహసాలవైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయంటున్నారు ఈ తరం మహిళలు.
 
 సెల్ప్ కాన్ఫిడెన్స్...
 కొత్త ప్రదేశాలు చుట్టిరావడమంటే కొత్త విషయాలు నేర్చుకోవడమే. ఆసక్తి ఉండాలే కానీ సాహస యాత్రలను మించిన అభిరుచి లేదంటారు ఐకామ్ టెలీ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రజనీ పోతినేని. ‘మా స్వస్థలం విజయవాడ. పదిహేనేళ్ల కిందట హైదరాబాద్‌కు మారాం. విజయవాడలో చదువుతున్నప్పుడు మా కళాశాలలో స్పోర్ట్స్ ఈవెంట్లలో చలాకీగా ఉండేదాన్ని.
 
  సిటీలోనూ జరిగే వివిధ రన్స్‌లో పాల్గొంటుండేదాన్ని. అలా నాకు  నాలుగేళ్ల కిందట గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ (జీహెచ్‌ఏసీ) గురించి తెలిసింది. వెంటనే అందులో సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుంచి ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్‌ల్లో చురుగ్గా పాల్గొంటున్నా’ అని సంతోషంగా చెబుతున్నారామె. ‘ఈ సాహసయాత్రల కోసం ఎక్కువ దూరాలు వెళ్లాల్సిన పనిలేదు. నగరానికి చుట్టూనే ఎన్నో మంచి ప్రాంతాలున్నాయి. భువనగిరి ఫోర్ట్, శేషాచలం కొండలే అందుకు ఉదహరణ. వాటిపైకి ఎక్కడం, అందరితో కలిసి చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని వంటచేసుకొని తినడం. అదో అద్భుతమైన అనుభూతి. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కొత్త ప్రదేశాలు... అడవుల్లో పర్యటించినప్పుడు కలిగే ఆనందం, సొంతమయ్యే ఆత్మస్థైర్యం అంతా ఇంతా కాదు’ అంటూ రజనీ అనుభూతులను నెమరువేసుకున్నారు.
 
 జాగ్రత్తలు అవసరం...
 మహిళలు ఒంటరిగా సాహసయాత్రలు చేయగలరా? ఇంటి గడప దాటని వారు... నదులు దాటగలరా? ఇలాంటి ఎన్నో అభిప్రాయాలు, అనుమానాలు. కానీ అలాంటి సందేహాలకు తమ సాహసాలతో సమాధానం చెబుతున్నారీ మహిళలు. ‘ఏటవాలుగా ఉన్న కొండలు ఎక్కుతుంటే జారిపోతున్నట్లుంటుంది. కాస్త కష్టమే అయినా అదో ఆనందం. తాడు సాయంతో నది దాటడం, రాత్రిళ్లు ఆడవుల్లో తిరగడం లాంటివాటికి చాలా మంది భయపడతారు. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. సాహసయాత్రలు చేయాలనుకున్నవారు ఒకేసారి సుదూరాలు వెళ్లాలనుకోకూడదు. మొదట స్థానికంగా ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి. అప్పుడే అవగాహన వస్తుంది.
 
 ఆసక్తి ఉండాలి. మానసికంగా మనల్ని మనం సిద్ధం చేసుకోగలగాలి. సాహసాలకు అవసరమైన నైపుణ్యాలను ఒంటబట్టించుకోవాలి. జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. స్థానిక ప్రాంతాలే కాదు... మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ఆడవుల్లోనూ మేం ప్రయాణించాం’ అని చెప్పుకొచ్చింది ఇన్నోమైండ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సిరి అప్పినేని.
 
 లైఫ్‌కి అన్వయించుకోవచ్చు...
 మంచి అభిరుచి ఎంచుకోవడమే కాదు. దాన్ని జీవితానికి అన్వయించుకోవడం తెలిసుండాలి. అదే అసలైన ఆనందం అంటున్న హైదరాబాదీ యువతి ఫరీదా సుల్తాన్. ఈమె ఫ్రిలాన్స్ కన్సల్టెంట్. ముస్లిం కుటుంబం నుంచి వచ్చినా ట్రెక్కింగ్, ఆడవుల్లో పర్యటించడం, పర్వతాలు ఎక్కడం.. అంటే ఎంతో ఆసక్తి. ఆమె ఆసక్తికి కుటుంబ ప్రోత్సాహం తోడయ్యింది. ఇంకేముంది... వారాంతం వస్తే చాలు... సాహసాలకే సమయం కేటాయిస్తుంది.
 
  హైదరాబాద్‌లోని మౌలాలి, శామీర్‌పేట్, ఖాజాగూడ, అమ్మగూడలోని గుట్టలే కాదు... మహారాష్ట్రలోని పుణేను చుట్టి వచ్చిందీమే. ‘పుణేలోని ఎత్తై ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ కొండల్లో రాత్రంగా ఉండడం, నిశీధిని జాగ్రత్తగా గమనించడం, వంట చేసుకోవడం, అదో మధురానుభూతి. ఈ యాత్రల వల్ల నేను చాలా నేర్చుకున్నా. ట్రక్కింగ్‌కి వెళ్లేటప్పుడు అవసరమైన సామగ్రిని మాత్రమే తీసుకెళతామంటోంది ఫరీదా. మానసిక దృఢత్వం, దేన్నయినా సాధించగలమనే ఆత్మవిశ్వాసం... ఎందుకు చేయలేమనే పట్టుదల... వంటివన్నీ సాహసయాత్రలతోనే అలవాడతాయి. పని ఒత్తిడి నుంచి కాస్త విశ్రాంతి పొందడానికి ఇలాంటి సాహసాలకు మించిన రిఫ్రెష్‌మెంట్ లేదంటోంది ఫరీదా.
 

మరిన్ని వార్తలు