కరెంట్‌ లైన్‌ ఉమెన్‌లు వస్తున్నారు!

19 Mar, 2018 00:39 IST|Sakshi

జేఎల్‌ఎం పోస్టులకు కేవలం పురుషులే అర్హులు

మేము సైతం అని ముందుకొస్తున్న మహిళలు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖ చరిత్రలో జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం)గా మహిళలను సైతం నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో భాగంగా కనీసం 20 అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్‌ స్తంభాలను అలవోకగా ఎక్కి మరమ్మతులు చేయడం జేఎల్‌ఎంల ప్రధాన బాధ్యత. కఠోర శారీరక శ్రమతో కూడి ఉండటంతో పాటు ప్రమాదకరమైన బాధ్యతలు గల ఈ వృత్తిని స్వీకరించేందుకు ఒకప్పుడు పురుషులూ ముందుకు రాకపోయేవారు.

విద్యుత్‌ సంస్థలు ఇప్పటివరకు జేఎల్‌ఎంలుగా పురుష అభ్యర్థులనే నియమిస్తూ వస్తున్నాయి. తాజాగా జేఎల్‌ఎం పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించడం విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలను పునరాలోచనలో పడేసింది. 2,553 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి ఉత్తర టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ గత నెల 16న నోటిఫికేషన్‌ జారీ చేయగా, దరఖాస్తు గడువు ఈ నెల 19తో ముగియనుంది.  

50 వరకు దరఖాస్తులు..
జేఎల్‌ఎం పోస్టులకు సుమారు 50 మంది వరకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం తిరస్కరించింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన హుమేరా అంజుమ్‌తోపాటు మరో ఆరుగురు మహిళలు దరఖాస్తుల తిరస్కరణను వ్యతిరేకిస్తూ హై కోర్టును ఆశ్రయించారు.

ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను విడుదల చేయరాదని కోరింది. హైకోర్టు ఆదేశాలతో నియామక ప్రక్రియలో మహిళా అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  

పోల్‌ క్లైంబింగ్‌లో విజయం సాధిస్తేనే..
నియామక ప్రక్రియలో భాగంగా తొలుత నిర్వహించే రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరిగా విద్యుత్‌ స్తంభాలను ఎక్కడంలో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించేందుకు శారీరక పరీక్షనూ నిర్వహించనున్నారు. పోల్‌ క్లైంబింగ్‌ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులనే జేఎల్‌ఎం పోస్టులకు అర్హులుగా పరిగణిస్తారు. జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో మహిళా అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

విద్యుత్‌ సంస్థలు నియామక నిబంధనలను మార్చుకుని జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో 33 1/3 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తాయా? అమలు చేస్తే పోస్టుల నియామకంలో భాగంగా మహిళా అభ్యర్థులు విద్యుత్‌ స్తంభం ఎక్కి అర్హతను నిరూపించుకోవాల్సిందేనా? లేక మినహాయింపు ఇస్తారా? అనే అంశాలపై విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

హైకోర్టు తీర్పు ఆధారంగానే.. కోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఏడుగురు పిటిషనర్ల దరఖాస్తులే స్వీకరించి నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. జూనియర్‌ లైన్‌మెన్‌లు విధి నిర్వహణలో భాగంగా విద్యుత్‌ స్తంభాలను ఎక్కాల్సి వస్తుందని, అందుకే మహిళా అభ్యర్థులను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఎప్పటిలాగా ఈ పోస్టుల భర్తీలో నిబంధనలను అనుసరిస్తున్నామని, హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు