గ్రేటర్ 'ఓటరు నమోదు'లో విచిత్రం..

4 Jan, 2016 23:13 IST|Sakshi
గ్రేటర్ 'ఓటరు నమోదు'లో విచిత్రం..

- భారతీయురాలు కాదంటూ దరఖాస్తు తిరస్కరణ
- కుషాయిగూడ మీ సేవా కేంద్రం తీరుతో విస్తుపోయిన మహిళ


హైదరాబాద్: 'ఓటు మీ హక్కు.. ఆ హక్కు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి' అంటూ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఈసీ చేసిన ప్రచారానికి జాగృతురాలైన ఓ మహిళ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె పుట్టి పెరిగింది ఈ గడ్డపైనే. విదేశాలు కాదుకదా పక్క రాష్ట్రం వెళ్లొచ్చిన దాఖలాలూ లేవు. కానీ మీ సేవా వెబ్ పోర్టల్ మాత్రం ఆమెను భారతీయురాలిగా గుర్తించలేదు. హైదరాబాద్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీకి చెందిన నేరళ్ల అనిత గత నవంబరు 17న కుషాయిగూడలోని మీసేవా కేంద్రంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఓటరుగా నమోదయింది లేనిది తెలుసుకునేందుకు సోమవారం అదే మీసేవా కేంద్రానికి వెళ్లింది. అయితే దరఖాస్తు తిరస్కరణకు గురైందని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయింది. ‘మీరు భారతీయురాలు కానందున దరఖాస్తును తిరస్కరిస్తున్నం’ అని కంప్యూటర్ లో కనిపించడంతో ఆశ్చర్యపోయింది. 'నేను భారతీయురాలు కాకపోవడమేంటి?' అని అక్కడి సిబ్బందిని ప్రశ్నించింది. సిస్టమ్ ఓకే చెప్పనిదే తామేమీ చేయలేమని వారు బదులిచ్చారు. చేసేదేమీలేక మీసేవ వాళ్లిచ్చిన జిరాక్స్ కాపీతో అక్కడి నుంచి వెళ్లిపోయిందా మహిళ.

మరిన్ని వార్తలు