పాదచారికి జై..

27 Apr, 2016 00:47 IST|Sakshi
పాదచారికి జై..

* జంక్షన్ల ఆధునికీకరణ, ఎఫ్‌వోబీల ఏర్పాటు
* అధ్యయనం చేసిన ట్రాఫిక్ పోలీసులు
* ప్రభుత్వానికి చేరిన సమగ్ర నివేదిక
* రెండు విడతల్లో పనులు..!

సాక్షి, సిటీబ్యూరో: ‘పాదచారే రోడ్డుకు రాజు’.. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఈ నానుడి నగరానికి మాత్రం సరిపోవడం లేదు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో పాదచారులది రెండో స్థానం. సిటీలో ఈ పరిస్థితులు నెలకొనడానికి అనేక కారణాలు ఉన్నాయి.

హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం.. ట్రాఫిక్ స్థితిగతులను చక్కదిద్దేందుకు అధ్యయనం చేయించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించిన ట్రాఫిక్ పోలీసులు పాదచారి భద్రతకు పెద్దపీట వేశారు.
 
అనేక కోణాల్లో జంక్షన్ల అభివృద్ధి
సిటీలోని ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిలో పాదచారుల కోణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం సిటీలో ప్రధానంగా నాలుగు రకాల జంక్షన్లు ఉన్నాయి. నాలుగు కంటే ఎక్కువ రహదారులు కలిసే జంక్షన్లు, నాలుగు రోడ్లు కూడళ్ల చౌరస్తాలతో పాటు మూడు రోడ్లతో కూడిన ‘టి’, ‘వై’ జంక్షన్లు ఉన్నాయి. ఇలా ప్రతి జంక్షన్‌లోనూ పాదచారులు రోడ్డు దాటేందుకు కచ్చితంగా ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. రెడ్ సిగ్నల్ పడేదాకా చౌరస్తాలో వేచి ఉండేందుకు రోడ్డుకు పక్కగా సౌకర్యవంతంగా ఉండే ప్లాట్‌ఫాములు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
 
రెయిలింగ్స్, హూటర్స్..
ఆయా జంక్షన్లలో పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో తనచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేదుకు రెయిలింగ్స్ ఏర్పాటును సూచించారు. జంక్షన్ స్థాయిని బట్టి అన్ని రోడ్లలోకూ ఎడమ వైపు ఫుట్‌పాత్‌ను అనుసరించి 100 నుంచి 200 మీటర్ల వరకు రెయిలింగ్ ఏర్పాటు చేస్తారు. రోడ్ క్రాసింగ్ మార్క్ ఉన్న ప్రాంతంలో వీటికి ఓపెనింగ్ ఇస్తారు. ఫలితంగా పాదచారి ఆ ప్రాంతంలో మాత్రమే రహదారి దాటే వీలుంటుంది. అంధులు రోడ్డు దాటుతున్న సమయంలో ఆ విషయం వాహన చోదకులకు స్పష్టంగా తెలిసేలా ‘హూటర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక శబ్దం చేసే ఈ హూటర్ సదరు పాదచారి రోడ్డు దాటే వరకు మోగుతూనే ఉంటుంది.
 
ప్రత్యేక డిజైన్‌తో ఎఫ్‌వోబీలు
జంక్షన్లు, రోడ్డు క్రాసింగ్‌కు అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల (ఎఫ్‌వోబీ) ఏర్పాటుకు ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రతిపాదించారు. వీటితోపాటు పాదచారులు రోడ్డు దాటేం దుకు అవకాశమున్న వాణిజ్య, విద్యా కేంద్రాలు ఎక్కువగా ఉన్న చోట్లా వీటిని నిర్మించాలని సూచించారు. ప్రధానంగా దిల్‌సుఖ్‌నగర్, కోఠి, బేగంబజార్, అమీర్‌పేట్, మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వీటి ప్రాధాన్యం ఎక్కువని నివేదించారు. గతంలో మాదిరిగా కేవలం బ్రిడ్జి మాత్రమే నిర్మించకుండా ప్రతి ఎఫ్‌వోబీకి లిఫ్ట్, జనరేటర్ సౌకర్యం కచ్చితంగా ఉండాలని, అప్పుడే వీటి వినియోగం ఆశించిన స్థాయిలో ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు.
 
‘మెట్రో’పై ప్రత్యేక దృష్టి
నగరంలో మెట్రో రైల్ ప్రారంభమైన తర్వాత ఆయా ప్రాంతాల్లో పాదచారుల తాకిడి పెరుగుతుందని ట్రాఫిక్ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో స్టేషన్‌లో రైలు దిగి సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, ఆటో స్టాండ్లకు చేరుకునే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. దీనికోసం మెట్రో స్టేషన్లు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ‘స్కై వాక్స్’ సాధ్యం కావని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మల్టీ డెరైక్షన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉండే ఎఫ్‌వోబీల అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సాధారణంగా ఎఫ్‌వోబీలు ఒక మార్గంలో ఎక్కి, మరో మార్గంలో దిగేందుకు ఉపకరిస్తాయి. ‘మెట్రో’ వద్ద ఏర్పాటు చేసేవి ఆ స్టేషన్ నుంచి ఎంట్రీ ఉన్నా.. గరిష్టంగా మూడు మార్గాల్లో ఎగ్జిట్స్ ఉండేలా డిజైన్ చేయాలని నివేదించారు.
 
రెండు విడతల్లో పనులు..
ఇప్పటికే పోలీస్‌స్టేషన్ల వారీగా, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి అధ్యయనం పూర్తి చేసిన ట్రాఫిక్ విభాగం అధికారులు.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రతిపాదిత పనులను సర్కారు రెండు విడతల్లో చేపట్టే అవకాశముందని పేర్కొంటున్నారు. తొలి విడతలో తక్షణం అమలు చేసే, వ్యయం తక్కువగా ఉండే వాటికి ప్రాధాన్యం ఇస్తారని చెప్తున్నారు. భారీ వ్యయం, స్థల సేకరణ వంటి అంశాలతో ముడిపడున్న పనులను రెండో విడతలో పూర్తి చేసే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు