వరల్డ్‌క్లాస్..ట్రాష్!

12 Feb, 2014 01:55 IST|Sakshi
వరల్డ్‌క్లాస్..ట్రాష్!

 ప్రతిపాదనగానే ‘సికింద్రాబాద్’ అభివృద్ధి
 రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువు
 రెండో దశ ఎంఎంటీఎస్ నత్తనడక
 రైల్వే బడ్జెట్ వైపు.. నగరజీవి చూపు
 సాక్షి, సిటీబ్యూరో :
 ఏటేటా రైల్వే బడ్జెట్‌లు వస్తూనే ఉన్నాయి. నగరంలో ఆగి ఆగకుండానే వెళ్తున్నాయి. ప్రతిపాదనలు పెండింగ్ జాబితాలో చేరిపోతున్నాయి. తాజాగా ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్ రానుంది. బుధవారం రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే దీనిని ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన పనులకే దిక్కు లేకుండా పోయింది. ఈ బడ్జెట్‌లో నగరానికి చోటు దక్కుతుందా అనేది సందేహాస్పదంగానే ఉంది. సికింద్రాబాద్ స్టేషన్‌ను ‘వరల్డ్‌క్లాస్’ చేయాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లకు మాత్రమే అది పరిమితమైంది. నాంపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ ఎండమావిగానే మారింది. ఒకప్పటి ప్రతిష్టాత్మకమైన కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. చాలావరకు ఎంఎంటీఎస్ స్టేషన్లలో కనీస సదుపాయాలు లేవు. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సైతం నేటికీ అమలుకు నోచుకో లేదు.
 
  లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆసుపత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా ఆచరణకు నోచుకోలేదు. నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రాయి కూడా పడలేదు. ఎంతో ఆర్భాటంగా, ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చిన బాల్‌పోర్‌బెట్టి, కాళింది నిర్మాణ్ వంటి సంస్థలు సైతం తాజాగా
 తప్పుకొని వెనుకడుగు వేశాయి. జీఎమ్మార్, టాటాపవర్ సంస్థలతో రైల్వేశాఖ చర్చలు జరుపుతోంది. ఆ చర్చలు ముగిసి, పనులు ప్రారంభం కావడానికి మరో ఆర్థిక సంవత్సరం గడిచినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. నేటి బడ్జెట్‌లో.. నగరానికి కొత్త రైళ్లు వస్తాయా? గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయా? అని నగరవాసి ఆశగా ఎదురుచూస్తున్నాడు.
 
 ఎంఎంటీఎస్ స్టేషన్లు.. కనీస సౌకర్యాలు నిల్
     ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబీర్‌పురా రైల్వే స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు వెళుతుంటాయి. ఈ స్టేషన్ల నుంచి నగరంలోని సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి, బొల్లారంతో పాటు మహబూబ్‌నగర్, కర్నూల్, భువనగిరి, గుల్బార్గా తదితర ప్రాంతాలకు ప్రతి రోజు వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఈ ప్రయాణికులు ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరంలోకి  వెళ్లేందుకు బస్సులు లేవు. బస్సులు రైల్వేస్టేషన్‌లకు వచ్చేందుకు రోడ్లు లేవు. రాష్ట్రప్రభుత్వం, రైల్వేశాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఏళ్లుగా రైలు-బస్సు అనుసంధానం ఎండమావిగానే మిగిలింది.
     లింగంపల్లి  రైల్వేస్టేషన్ వద్ద నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రైళ్లు ఒకేసారి స్టేషన్‌కు వచ్చినప్పుడు  ఈ బ్రిడ్జిపై నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. స్టేషన్‌లో నీటి కుళాయిలు ఉన్నా వాటిలో బోరు నీటినే సరఫరా చేస్తున్నారు.
 
     హఫీజ్‌పేట్, చందానగర్ రైల్వేస్టేషన్‌లలో మంచినీటి సదుపాయం లేదు. ఫ్లాట్‌ఫాంలపై విద్యుత్ దీపాలు వెలగడం లేదు. పార్కింగ్ షెడ్లు లేవు. పోలీస్ నిఘా లేదు. ప్రయాణికుల భధ్రత గాలిలో దీపంగా మారింది.
 
     మౌలాలీ స్టేషన్ నుంచి ప్రయాణికులు బస్సు కోసం కిలోమీటర్నర దూరం నడిచి రావాల్సిందే. రహదారి వెంట విద్యుత్ దీపాలు లేవు. మూడు ప్లాట్‌ఫాంలు ఉన్నప్పటికీ ఒక వైపు నుంచి మరొక వైపు ప్రయాణికులు వెళ్లడానికి ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లేకపోవడంతో ప్రమాదకరమైనా సరే ప్రయాణికులు  పట్టాలు దాటే వెళ్లవలసి వస్తోంది. స్టేషన్ లో ప్రయాణికులకు వెయిటింగ్ హాళ్లులేవు. మంచినీటి సదుపాయం లేదు.
 
     మౌలాలీ స్టేషన్ నుంచి ప్రతిరోజు వందకు పైగా ఎక్స్‌ప్రెస్‌లు రాకపోకలు సాగిస్తాయి. కానీ ఒకటి , రెండు రైళ్లు మాత్రమే ఆగుతాయి. దీంతో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు మౌలాలీ నుంచి సికింద్రాబాద్‌కు పరుగెత్తవలసి వస్తోంది.
 
     మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌కు మల్లికార్జునగర్ వైపు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు అప్రోచ్ రోడ్డు లేదు
 
     స్టేషన్‌లో 24 బోగీల ైరె ళ్లు ఆగే విధంగా ఫ్లాట్ ఫామ్‌లు లేవు.
     స్టేషన్ చుట్టూ ఐదు ఎకరాల రైల్వే స్థలం ఉంది. స్టేషన్ విస్తరించవచ్చు. దీనివల్ల  కాచిగూడ, సికింద్రాబాద్‌లపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ అలాంటి చర్యలు చేపట్టడం లేదు.
 

మరిన్ని వార్తలు