పూజల పేరుతో పాములను హింసించొద్దు

4 Aug, 2016 00:49 IST|Sakshi
పూజల పేరుతో పాములను హింసించొద్దు

ప్రజలకు అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థల పిలుపు


హైదరాబాద్: నాగుల పంచమి సందర్భంగా పాములను పూజ పేరుతో హింసించవద్దని అటవీ శాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలను కోరాయి. పాములను హింసించడం నేరమని, చట్టప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బుధవారం అరణ్య భవన్‌లో అదనపు పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఓఎస్‌డీ (వైల్డ్ లైఫ్) శంకరన్ పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నాగుల పంచమి నాడు పాములకు పాలు, గుడ్లు పెట్టాలని ప్రయత్నిస్తూ హింసకు గురిచేస్తున్నారని.. పాములు పాలు తాగవని, గుడ్లు మింగవని గుర్తుంచుకోవాలని కోరారు. బలవంతంగా పాలు తాగించడం వల్ల పాముల ప్రాణాలకు ప్రమాదమని, పసుపు, కుంకుమలతో చేసే పూజల వల్ల వాటి కళ్లు కనిపించకుండా పోతాయని తెలిపారు.

ప్రజల సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు బుట్టల్లో పాములను తీసుకుని ఇంటింటికి తిరుగుతారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా పాములను బంధిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు ఫిర్యాదు చేయాలని కోరారు. 270 రకాల పాముల్లో కేవలం నాలుగు మాత్రమే ప్రమాదకరమని, అన్ని పాములను చంపకూడదని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఫ్రెండ్స్ ఆఫ్‌స్నేక్ సొసైటీ తరఫున అవినాశ్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుంచి సంయుక్తలతో పాటు బ్లూక్రాస్, పీపుల్ ఫర్ యానిమల్స్, హ్యూమన్ సొసైటీ, టైగర్ కన్సర్వేషన్ సొసైటీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు