అధికార లాంఛనాలతో ముగిసిన యాదయ్య అంత్యక్రియలు

27 Jun, 2013 20:27 IST|Sakshi
అధికార లాంఛనాలతో ముగిసిన యాదయ్య అంత్యక్రియలు
మూడు రోజుల క్రితం జమ్మూ,కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ఆంధ్రా జవాన్ ఎం యాదయ్య అంత్యక్రియలు మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లె గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. హైదరాబాద్ కు 90 కిలో మీటర్ల దూరంలోని కొండారెడ్డి పల్లెలో యాదయ్య అంత్యక్రియలను మేజర్ జనరల్ సైరస్ ఏ పిథావాలా పర్యవేక్షించారు. గురువారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న యాదయ్య  మృతదేహానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో సీనియర్ ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. అనంతరం ఆయన స్వస్థలానికి యాదయ్య మృతదేహాన్నితరలించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎస్ ఎమ్ మెహతా అధికార లాంఛనాలను దగ్గరుండి నిర్వహించారు. 
 
యాదయ్య మృతదేహం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి, తుపాకులతో వందనం సమర్పించారు. సోమవారం శ్రీనగర్ లో ఉగ్రవాదుల జరిపిన దాడిలో యాదయ్యతోపాటు మరో ఎనిమిది మంది మృతి చెందగా, 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2003 సంవత్సరలో ఆర్మీ చేరిన యాదయ్య గోవా, అస్సాంలో సేవలందించారు. ఏడాది క్రితమే కాశ్మీర్ లో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం 35 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో యాదయ్య పనిచేస్తున్నారు.
 
యాదయ్య కు భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లి తండ్రులున్నారు. పేదరికంతో బాధపడుతున్న కుటుంబానికి యాదయ్య ఆదాయం కీలకం కావడంతో వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యాదయ్య పిల్లల చదువుకు ప్రతినెల 1500 రూపాయల భృతిని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. యాదయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేస్తానని జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇంటిస్థలంతోపాటు, 2.5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 ఎకరాల బీడు భూమిని ప్రభుత్వం ఇస్తుందని డీకే అరుణ తెలిపారు. 
మరిన్ని వార్తలు