అడ్డంగా దొరికి నీతులా?

13 Oct, 2016 03:04 IST|Sakshi
అడ్డంగా దొరికి నీతులా?

చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో వీడియో, ఆడియోల సాక్ష్యంగా అడ్డంగా దొరికిపోయినా పదవికి రాజీనామా చేయని ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ధ్వజమెత్తారు. నల్లడబ్బుతో అడ్డంగా దొరికిపోయి ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు, పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు నల్లధనం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. బొగ్గు నుంచి ఇసుక వరకు, పోలవరం నుంచి పట్టిసీమ వరకు, రాజధాని భూముల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల వరకు.. ప్రతీ అంశంలోనూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని మండిపడ్డారు.

ఆయన బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు హైదరాబాద్‌లో ఉంటానని, తెలంగాణలో టీడీపీని గెలిపించాకే విజయవాడ వెళతానని చెప్పిన కొద్దిరోజులకే... ఓటుకు కోట్లు కేసు, ఆర్థిక సంబంధమైన అంశాల్లో పోలీసుల విచారణకు గురికావాల్సి వస్తుందన్న భయంతోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. దేవుని సొమ్ముపైన కూడా కన్నేసి సదావర్తి సత్రం భూములను తనవారికి కట్టబెట్టారని చెప్పారు. స్విస్ చాలెంజ్ పేరుతో రాజధాని భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి వేలకోట్ల కమీషన్ దండుకోనున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అతి ధనవంతుడైన సీఎం, అతి ధనవంతుడైన మంత్రిని కలిగింది ఏపీ అని ప్రజాప్రతినిధుల గురించి సర్వే చేసే ఓ సంస్థ చెప్పిన విషయం నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే రూ.లక్షన్నర కోట్లు అవినీతి చేశారని పుస్తకం వేసి ప్రధాని, రాష్ట్రపతులతోపాటు అందరికీ సాక్ష్యాలతోసహా సమాచారమిచ్చామని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఎలా దోచుకుంటున్నారో.. ఇటీవల ఈనాడు పత్రిక కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. ఎన్నికల్లో గెలిచింది మొదలు ప్రతీ అంశంలోనూ సొమ్ము చేసుకోవడంపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు నల్లధనం గురించి నీతులు చెబుతుంటే దేశ ప్రజలంతా విస్తుపోతున్నారని చెప్పారు. బాబు జీవితమంతా.. అబద్ధాలు, అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు. పట్టిసీమ నీటిని రాయలసీమకు అందించానని, రెయిన్‌గన్స్‌తో సీమ కరువును పారదోలానని, 2018లో అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహిస్తానని చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చారేమో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

దమ్ముంటే నిరూపించు...
నల్లధనం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న దొంగ ప్రచారాన్ని కట్టిపెట్టాలని, దమ్ము,ధైర్యముంటే నిరూపించాలని చంద్రబాబుకు పార్ధసారధి సవాల్ విసిరారు. నీతి నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే తమ సవాలును స్వీకరించాలన్నారు. హైదరాబాద్‌లో రూ.పదివేల కోట్ల నల్లధనాన్ని ఎవరు వెల్లడించారో ఆధారాలతోసహా బయటపెట్టాలన్నారు. ఏ ప్రాంతం నుంచి ఎంత నల్లడబ్బు వచ్చిందన్న విషయాన్ని చెప్పబోమన్న కేంద్రం ప్రకటనకు విరుద్ధంగా సీఎం దొంగ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకపథకం ప్రకారం జగన్‌పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ తప్పుల్ని, లోపాల్ని ఎవరూ పట్టించుకోకూడదని, ఇతరులవైపు దృష్టి మళ్లించాలనే దురుద్దేశంతోనే ప్రతిపక్ష నేతపై దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు