ఈ గోడ... చరిత్రకు జాడ!

3 Jan, 2018 03:17 IST|Sakshi

ఆసక్తి రేపుతున్న పురాతన నిర్మాణ ఆనవాళ్లు

జనగామ చేరువలో తాజాగా వెలుగుచూసిన కట్టడం

బౌద్ధ స్తూపం లేదా చైత్యం అయి ఉంటుందని అంచనాలు

నేడు పరిశీలించనున్న పురావస్తు శాఖ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు రెండడుగుల పొడవున్న భారీ ఇటుకలు.. గోడ తరహాలో వరుసగా పేర్చిన నిర్మాణం.. వృత్తాకారంలో ఉందన్నట్లు వంపు తిరిగిన ఆకృతి.. తాజాగా బయటపడ్డ ఓ గోడ ఆకృతి ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. శాతవాహనుల కాలం నాటి కట్టడంగా భావిస్తున్న ఈ గోడ బౌద్ధ నిర్మాణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా బౌద్ధ స్తూపాలు వృత్తాకారంలో ఉంటాయి. చైత్యాలు ఆంగ్ల అక్షరమాలలోని ‘యు’ఆకృతిలో ఉంటాయి. తాజాగా వెలుగుచూసిన కట్టడం ప్రాథమిక ఆనవాళ్లు వంపు తిరిగి ఉండటంతో స్తూపమో, చైత్యమో అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కట్టడం పుట్టు పూర్వోత్తరాలు తేల్చేందుకు పురావస్తుశాఖ నడుం బిగించింది. బుధవారం ఉదయం పురావస్తు శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించి నిగ్గు తేల్చనున్నారు.

జనగామకు చేరువలో..
భువనగిరి–జనగామ మధ్యలోని పెంబర్తికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఎల్లంల గ్రామ శివారులో ఈ నిర్మాణం వెలుగు చూసింది. చాలాకాలంగా ఇక్కడ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఐదు రోజుల కింద కూలీలు ఇసుక తవ్వుతుండగా రెండుమీటర్ల లోతులో ఇటుక నిర్మాణం కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఉపాధ్యాయుడు రత్నాకర్‌రెడ్డి వెళ్లి పరిశీలించి అది పురాతన కట్టడంగా భావించారు. రెండు అడుగులకు కాస్త తక్కువ పొడవుతో ఉన్న ఇటుకలు కావటంతో అవి శాతవాహన కాలానికి చెందినవే అయి ఉంటా యని భావించి విషయాన్ని పురావస్తు శాఖ దృష్టికి తెచ్చారు. పురావస్తుశాఖ డైరెక్టర్‌ విశా లాచ్చి వెంటనే స్పందించారు. వాటిని పరిశీలించాల్సిందిగా అధికారి భానుమూర్తిని ఆదేశించడంతో ఆయన స్థానిక సిబ్బందితో కలసి బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

పర్యాటకానికి ఊతం..
ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలు, చైత్యాలు వెలుగు చూశాయి. ఫణిగిరి, ధూళికట్ట, నేలకొండపల్లి, కోటలింగాలలో బౌద్ధ నిర్మాణాల జాడలు బయటపడ్డాయి. బుద్ధుడి బోధనలు వినేందుకు వెళ్లి వచ్చిన బావరి నివసించిన ప్రాంతం కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఇక్కడి నుంచే బౌద్ధ మత ప్రచారం ప్రారంభమై చైనా వంటి దేశాలకు పాకిందన్న ఆధారాలు వెలుగుచూడటంతో రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకానికి ప్రాధాన్యం పెరుగుతోంది. నాగార్జునసాగర్‌ తీరంలోని బుద్ధవనంలో తైవాన్‌లాంటి దేశాల సాయంతో బౌద్ధ విశ్వవిద్యాలయ స్థాపనకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే కేంద్రం బౌద్ధ ప్రాంతాల అభివృద్ధికి నిధులనూ కేటాయించింది. ఈ తరుణంలో జనగామ ప్రాంతంలో వెలుగుచూసిన కట్టడం బౌద్ధ నిర్మాణమైతే మరింత ఊతమొచ్చినట్లు అవుతుంది.

మరిన్ని వార్తలు