నిజామాబాద్ జిల్లాలో పసుపు పార్కు

22 Mar, 2016 04:34 IST|Sakshi
నిజామాబాద్ జిల్లాలో పసుపు పార్కు

రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టాలని సీఎం నిర్ణయం   
రూ.30.81 కోట్ల వ్యయ అంచనా.. ఈ ఏడాది రూ.15 కోట్లు

 
 సాక్షి, హైదరాబాద్: పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేలా నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడిగల్ గ్రామంలో పసుపు (టర్మరిక్ స్పైస్) పార్కును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి నిజామాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల్లోని పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల రైతులకు బాసటగా నిలవాలని సీఎం భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పార్కును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాల్సి ఉంది.

11వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్పైస్ పార్కులు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన పార్కును గుంటూరు జిల్లాలో నిర్మించారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో కూడా స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు పడిగల్ గ్రామంలో ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో 40 ఎకరాల భూమిని కూడా సేకరించి, అక్కడ స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. దీనికి మొదట ఎన్డీఏ ప్రభుత్వం సమ్మతించి సర్వే కూడా చేయించింది. ప్రాసెసింగ్ యూనిట్, గోదాములు, పరిపాలనా భవనం, కంప్యూటర్ ట్రేడింగ్ సెంటర్లతో కూడిన పార్కు ఏర్పాటుకు సమగ్ర నివేదిక రూపొందించింది. దీనికి మొత్తం రూ.30.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

కానీ చివరికి కేంద్రం చేతులెత్తేసింది. దీంతో ఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపట్టాలని, ఇప్పటికే స్థల సేకరణ జరిగినందున పడిగల్‌లోనే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి ఈ ఏడాది రూ.15 కోట్లు, వచ్చే ఏడాది రూ.15.81 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ పార్కు ఏర్పాటుతో సుగంధ ద్రవ్యాల పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు తరలివచ్చే అవకాశముంటుంది. కాగా కేంద్రం మాట తప్పినా... పసుపు రైతులకు అండగా ఉండేలా పసుపు పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్పైస్ పార్కు ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి, ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు