మీరు ఒంటరి కాదు..

30 Aug, 2016 02:00 IST|Sakshi
మీరు ఒంటరి కాదు..

ముద్రగడ పద్మనాభంకు దాసరి భరోసా

 సాక్షి, హైదరాబాద్: ‘మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది. కాపు, తెలగ, బలిజ తదితర అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే నా అభిమతం కూడా. ఈ ఉద్యమంలో మీ వెంట మేమున్నాం. మీరు ఎంతమాత్రం ఒంటరి కాదు’ అని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు భరోసా ఇచ్చారు. కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను కాపు ప్రముఖులతో చర్చించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ముద్రగడ సోమవారమిక్కడ దాసరిని ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. వచ్చేనెల 11న రాజమండ్రిలో జరిగే కాపు సంఘాల జేఏసీ సమావేశం జయప్రదం కావాలని దాసరి ఆకాంక్షించారు.

రాజమండ్రి భేటీలో ప్రతిపాదించే అంశాలపై చర్చించేందుకు మంగళవారం మరోసారి దాసరి ఇంట్లో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ భేటీకి చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పళ్లంరాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కఠారి అప్పారావు, అద్దేపల్లి శ్రీధర్, జనార్ధన్, న్యాయవాది గంగయ్యనాయుడు, తోట చంద్రశేఖర్, బైరా దిలీప్ తదితర కాపు ప్రముఖులను దాసరి ఆహ్వానించారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రంగాలకు చెందిన పలువురు కాపు ప్రముఖులతో ముద్రగడ రహస్య మంతనాలు జరిపారు. ఈనెల 31లోగా ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే కోర్టుల్లో కేసు విషయం తదితర అంశాలను చర్చించినట్టు సమాచారం. వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు.. దాసరి ఇంట్లో ముద్రగడను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. షూటింగ్‌లో బిజీగా ఉండడంతో చిరంజీవిని కలవలేకపోయారు.

 బాబు, లోకేష్, పవన్ దీక్షకు దిగి.. నాకూ చోటిస్తే కూర్చుంటా
 ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ సినీ నటుడు పవన్ కల్యాణ్ చేపట్టే ఉద్యమానికి.. కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధం లేదని ముద్రగడ చెప్పారు. హోదా కోసం చంద్రబాబు, లోకేశ్, పవన్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని, ఆ వేదికపై తనకూ చోటిస్తే కలిసి దీక్ష చేయడానికి సిద్ధమేనన్నారు.

మరిన్ని వార్తలు