ఆ గుండెల్లో నువ్వు పదిలం

2 Sep, 2016 02:25 IST|Sakshi
ఆ గుండెల్లో నువ్వు పదిలం

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ.. ఈ మాట వినగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్సార్! ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల ముంగిట నిలిపిన ఈ పథకం లక్షలాది మంది బతుకుల్లో వెలుగులు నింపింది. ఆరిపోతున్న జీవితాలకు ఆయువు పోసింది. గుండెకు పడిన చిల్లులను ఉచితంగా పూడ్చింది. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు తెలంగాణలో 14.72 లక్షల మంది పేదలకు శస్త్రచికిత్సలు చేశారు. అందుకు వైఎస్ హయాం నుంచి ఇప్పటివరకు రూ.3,858 కోట్లు ఖర్చు చేశారు. పథకం ప్రారంభమైన 2007-08లో తెలంగాణలో 7,105 మందికి శస్త్రచికిత్సలు చేశారు.

అందుకు నాటి ప్రభుత్వం రూ.31.12 కోట్లు ఖర్చు చేసింది. 2008-09 నుంచి పథకం పేదలకు మరింత దగ్గరైంది. ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. 2008-09లో ఏకంగా 86,287 శస్త్రచికిత్సలు నిర్వహించారు. అందుకు వైఎస్ ప్రభుత్వం రూ.261.15 కోట్లు వెచ్చించింది. 2009-10లో ఆపరేషన్ల సంఖ్య 1.29 లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడ్డాక 2014-15లో 2.36 లక్షల మందికి, 2015-16లో 2.60 లక్షల మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ పథకం కింద గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవ మార్పిడులను కూడా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్యాన్సర్‌లో కీలమైన నాలుగు శస్త్రచికిత్సలకు కూడా అవకాశం కల్పించింది.

మరిన్ని వార్తలు