అన్యాయంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవు

11 Jun, 2017 03:30 IST|Sakshi
అన్యాయంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవు
- కొందరు ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు..
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం
 
హైదరాబాద్‌: అధికార పార్టీకి తొత్తులుగా మారి అన్యాయంగా వ్యవహరిస్తూ, అనైతిక చర్యలకు పాల్పడుతున్న అధికారులకు తిప్పలు తప్పవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. తాను తన స్వప్రయోజనాల కోసం అధికారులను వాడుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు ఆరోపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారంసోమాజీగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రగిరి నియోజకవర్గ అధికారులను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు ఒక్క ఉద్యోగితో చెప్పించండని సవాలు విసిరారు.

అధికార పార్టీ వాళ్లు చెప్పారని.. న్యాయం ధర్మం, చట్టం, నిబంధనలు గాలికి వదిలి.. తమ పార్టీకి ఓటు వేసిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను అన్యాయంగా తీసి వేస్తున్న అధికారులను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. అధికారులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండి భరోసా కల్పించే వ్యక్తిత్వం తనదన్నారు. నియోజకవర్గంలో పనిచేసే కానిస్టేబుల్‌ మొదలు ఎస్‌ఐ వరకు.. తలారీ నుంచి తహసీల్దార్‌ వరకు, గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీఓ వరకు దాదాపు 2500 మంది ప్రభుత్వ ఉద్యోగులను తోబుట్టువులుగా భావించి ఏటా ఉగాది పండుగ రోజున దుస్తుల పంపిణీ చేస్తున్నానని తెలిపారు.

 కొందరు అధికారుల నీచపు చర్యలతో తమ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా బాధపడితే.. అందుకు కారణమైన వారిపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయంటే అవి ఏ విధంగా తప్పవుతాయని ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించారు. తహసీల్దార్‌ వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఏమయ్యాయని నిలదీశారు. విజయవాడలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సీనియర్‌ అధికారిపై దాడి చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయని, టీడీపీ ఎమ్మెల్యే ఒక ఎస్‌ఐని, సిబ్బందిని నిర్భందిస్తే ఎందుకు అరెస్టు చేయించలేకపోయారని ప్రశ్నించారు. 
మరిన్ని వార్తలు