ప్రాణం తీస్తున్నజోష్

18 Jul, 2013 04:17 IST|Sakshi
ప్రాణం తీస్తున్నజోష్
 సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలే ఎక్కువగా యువతను బలి తీసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. వీటి బారిన పడిన వారిలో 30 శాతం మంది 15-30 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారనీ స్పష్టం చేసింది. సాలీనా కనిష్టంగా 3,35,805 మంది యువతను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని పరిస్థితులూ దీనికి భిన్నం కాదు. ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో యువత, ప్రమాదాల బారిన పడుతున్న వాహనాల్లో ద్విచక్ర వాహనాలు (యువత ఎక్కువగా వినియోగించేవి) ఎక్కువగా ఉంటున్నాయి. 
 
కొరవడిన అజమాయిషీ, పట్టని ప్రభుత్వ యంత్రాగాలు, కరవైన పటిష్ట చట్టాల ఫలితంగా ఎలాంటి బ్రేక్ లేకుండా సాగుతున్న జోష్‌తోనే ఈ పరిస్థితిలు ఉత్పన్నం అవుతున్నాయి. బుధవారం హయత్‌నగర్ ఠాణా పరిధిలో హైఎండ్ బైక్‌ల రేసింగ్ కారణంగా ‘ఐఏఎస్’ విద్యార్థి ప్రసన్నకుమార్ 19 ఏళ్లకే అర్ధాంతరంగా చనిపోయాడు. 2012 గణాంకాల ప్రకారం నగరంలో మొత్తం 2577 ప్రమాదాలు చోటు చేసుకోగా... మృతులు 464, క్షతగాత్రులు 2471 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు 15-30 ఏళ్ల మధ్య వయస్కులే కావడం ఆందోళన కలిగించే అంశం. దీనికి కారణాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
 
 టీనేజర్లు... టూ వీలర్లు...
 
 ఏటా నగరంలో నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తరవాతి స్థానం తేలికపాటి వాహనాలైన కార్లు వంటి వాటిది. ఈ కారణంగానే ప్రమాదాల బారిన పడుతున్న వాటిలో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహనచోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా అనేక విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వాటికి వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు అడపాదడపా చోటు చేసుకుంటున్న రేసింగ్స్ కూడా అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్నాయి. 
 
పటిష్ట చట్టాల లేమి...
 
 నగరంలోని రోడ్లపై వాహనాల కనిష్ట వేగం గంటకు 18 కి.మీ. చేరట్లేదు. అయితే ఇటీవల కాలంలో దిగుమతి అవుతున్న, తయారవుతున్న వాహనాలు గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకుపోయేవిగా ఉంటున్నాయి. ఈ వేగం అంటే  యువతకు క్రేజ్ కావడంతో కోరి ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రసన్నకుమార్ వినియోగించిన డ్యూక్-200 బైక్ సామర్థ్యాన్నే తీసుకున్నా ఇది గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. నగరంలోని రోడ్ల సామర్థ్యానికి మించిన వాహనాలు కుప్పలుతెప్పలుగా వస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెప్తున్నారు. అయితే అలా రాకుండా వాటిని అడ్డుకోవడానికి అవసరమైన చట్టాలు, నిబంధనలు మాత్రం లేవని స్పష్టం చేస్తున్నారు. 
 
తల్లిదండ్రుల పాత్రా ఎంతో...
 
 యాంత్రిక జీవితం నేపథ్యంలో తల్లిదండ్రులకు పిల్లల కదలికలు, బాగోగులు పట్టించుకునే తీరిక ఉండట్లేదన్నది ట్రాఫిక్ పోలీసుల మాట. దీంతో వీరు మరింత రెచ్చిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలకు మైనార్టీ తీరకుండా, లెసైన్స్ లేకుండా వాహనాలు కొని ఇస్తూ ‘ప్రేమను’ చాటుకుంటున్న తల్లిదండ్రులు.. పరోక్షంగా వారి విచ్చలవిడి తనానికి కారణమవుతున్నారని వారు చెప్తున్నారు. ఒకప్పుడు నగరంలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బైక్, కార్ రేసింగ్స్ ప్రస్తుతం ఔటర్ రింగ్‌రోడ్, దాని సమీపంలో ఉన్న మార్గాలకు చేరాయి. వీటిని గణించే, అడ్డుకునే పరికరాలు, యంత్రాంగం అదుబాటులో లేదు. ఉన్న వాటినీ సక్రమంగా వినియోగించడంలో ప్రభుత్వ శాఖలు విఫలం అవుతున్నాయి. 
 
ఇంజనీరింగ్ విద్యార్థులకు శాపం
 
 రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న యువతలో ఇంజనీరింగ్ విద్యార్థులే అత్యధికంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం కాలేజీలన్నీ శివార్లలో ఉండటమే. వీటికి విద్యార్థులు వచ్చి వెళ్లేందుకు అవసరమైన స్థాయిలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఫలితంగా కళాశాల బస్సులో, ఆ సౌకర్యం లేకుంటే సొంత వాహనాలే వారికి దిక్కవుతున్నాయి. వీటిపై దూసుకుపోతున్న యువకులు కోరి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఉన్నత, ఎగువ మధ్య తరగతి యువతలో ఇటీవల కాలంలో పార్టీ కల్చర్ పెరుగుతోంది. దీని కోసం శివార్లలో ఉన్న ఫామ్‌హౌస్‌లు, రిసార్టులకు వెళ్లి వస్తుండటం కూడా ప్రమాదాలకు ఓ కారణమవుతోంది.
మరిన్ని వార్తలు