యువోత్సాహ్

21 Jan, 2015 23:54 IST|Sakshi
యువోత్సాహ్

సంస్కృతి, సంప్రదాయాలు, కళల్లో దేశం గొప్పతనాన్ని చాటారు యువత. సికింద్రాబాద్ యూత్ హాస్టల్‌లో ఐదురోజుల పాటు జరిగిన ‘జాతీయ సమైక్యతా శిబిరం’ బుధవారంతో ముగిసింది. 10 రాష్ట్రాలకు చెందిన 208 మంది యువతీయువకులు పాల్గొని జాతి సమైక్యతను చాటారు. సమాజ పురోభివృద్ధిలో తమ పాత్రను వివరించి... కళా ప్రదర్శనలతో సందడి చేశారు.
ఇ.చంద్రశేఖర్, బన్సీలాల్ పేట్
 
సిక్కిం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. తమ సంస్కృతీ సంప్రదాయాలను పోటాపోటీగా ప్రదర్శించి ఔరా అనిపించారు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెసుద్దులు, చెంచు, బోనాల పండుగ ప్రదర్శనలు ఈ ఫెస్టివల్‌లో ఆకట్టుకున్నాయి.

వహరాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన లావ్‌ణీ నృత్య ప్రదర్శన యువతను అలరించింది. ముఖ్యంగా మహిళా వేషధారణలో యువకులు తమ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాన్ని తమదైన శైలిలో ప్రదర్శించి శభాష్ అనిపించారు. కేరళ ఆదివాసీ ప్రాంతాల్లోని పాలక్కాడ్ నృత్యాన్ని ఆక్కడి యువత ఆహుతుల కళ్లకు కట్టింది. మధ్యప్రదేశ్‌కు చెందిన టాటీయ ప్రదర్శన విభిన్నంగా సాగింది.
 
కర్తవ్యాన్ని గుర్తు చేసింది
నేను భారత్ తరపున 7 దేశాల్లో పర్యటించాను. అనేక యువ సమ్మేళనాలు, సదస్సుల్లో పాల్గొన్నాను. ఈ శిబిరం జాతి ఔన్నత్యాన్ని చాటింది. యువతీ, యువకుల కర్తవ్యాన్ని గుర్తు చేసింది.
 - ధనుంజయ్ ఠాకూర్, మధ్యప్రదేశ్
 
నగరం బాగుంది...
హైదరాబాద్ నగర అందాలు ఆకట్టుకున్నాయి. గోల్కొండ, చార్మినార్ ఇతర ప్రాంతాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఐదు రోజుల పాటు జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో మా రాష్ట్ర కళలను ప్రదర్శించే అవకాశం దక్కింది.
 - దీపా లించో, ఛత్తీస్‌గఢ్
 
సందేశాన్నిస్తాయి...
ఇలాంటి శిబిరాలు యువతీ, యువకులల్లో దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందిస్తాయి. భాషలు, ప్రాంతాలు, మతాలు వేరైనా మనమంతా భారతీయులమనే సందేశాన్నిస్తాయి.
 - ఆర్.వెంకటేశం, కో-ఆర్డినేటర్, నెహ్రూ యువక కేంద్రం, హైద్రాబాద్

మరిన్ని వార్తలు