సీబీఐ విచారణకు సిద్ధమా?

10 Mar, 2016 04:34 IST|Sakshi
సీబీఐ విచారణకు సిద్ధమా?

బాబూ.. భూదందాలో అసలు నిందితుడివి నువ్వే... విచారణ జరగాల్సింది నీ పైనే..
 
♦ రెండేళ్లయినా ఒక్క హామీ అమలు కాలేదు.. చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నష్టం..
♦ ఇక్కడ ఏడుస్తారు.. ఢిల్లీలో బ్రహ్మాండంగా పొగుడుతారు
♦ ప్రత్యేక హోదా, వృద్ధిరేటుపై గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు
♦ ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపాటు
 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసలు నిందితుడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. విచారణ జరగాల్సింది చంద్రబాబుపైనేనని అన్నారు. రాజధాని వ్యవహారంలో ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడ్డారని ఆరోపించారు. భూదందాపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని అధికార పక్షానికి సవాలు విసిరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో వైఎస్ జగన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్, రాజధానిలో భూదందా... వంటి కీలక అంశాలపై ఆధారాలు, గణాంకాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగం సాగింది. జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ అధికార పక్ష సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 కేంద్రాన్ని నిలదీయలేరా?
 ఈ రెండేళ్లలో సంతృప్తి కలిగించే ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా? ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? నెల రోజుల్లోగా హామీలు నెరవేర్చకపోతే కేంద్రంలోని తమ మంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చంద్రబాబు వ్యవహార శైలిని గమనిస్తే ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది.

 ‘హోదా’ అక్కర్లేదని అనుకోరా?
 విశాఖపట్నంలో ఇటీవల పెట్టుబడి సదస్సు నిర్వహించారు. అరడజను మంది కేంద్ర మంత్రులను పిలిచారు. రెండు రోజుల్లో రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని గొప్పలు చెప్పుకున్నారు. 48 గంటల్లో రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదని కేంద్ర మంత్రులు అనుకోరా? ప్రత్యేక హోదా వస్తే రూ.4.67 లక్షల కోట్లు కాదు.. దానికి నాలుగు రెట్లు పెట్టుబడులు, మన యువతకు ఉద్యోగాలు వచ్చేవి.

 ‘హోదా’ కోసం పోరాడుతున్నాం..
 ప్రత్యేక హోదా కోసం మేం పోరాడుతున్నాం. హోదాను రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పెట్టి ఉంటే సమస్య రాకపోయేదంటారు.
 ఈ చట్టాన్ని గతంలో ఎన్నిసార్లు సవరించలేదు? కేంద్రంలో టీడీపీ మిత్రపక్షమే ఉంది.. అయినా సవరించలేరా? ఇతర రాష్ట్రాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేదంటారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లుకు ఓట్లు వేసేటప్పుడు ఇతర రాష్ట్రాలు లేవా? కేంద్ర మంత్రి
 వర్గం నిర్ణయం తీసుకొని, ప్రణాళికా సంఘాన్ని ఆదేశించి రెండేళ్లవుతున్నా ఆ దిశగా చర్యల్లేకపోవడం బాధాకరం. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు రాదు?

 గతం చూసుకో బాబూ: గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా విదేశాల్లో షికార్లు కొట్టేవారు. పెట్టుబడి సదస్సులు పెట్టారు. ఆ తొమ్మిదేళ్లలో రూ.1,000 కోట్ల పైబడిన పెట్టుబడితో ఎన్ని గ్రీన్‌ఫీల్డ్ పరిశ్రమలు తెచ్చారు? ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు?  

 10.99 శాతం వృద్ధిరేటు బోగస్
 జాతీయ వృద్ధిరేటు 7.3 శాతం అయితే, రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధి నమోదైందని గవర్నర్‌తో అబద్ధం చెప్పించారు. కేంద్రం చెబుతున్న 7.3 శాతమే వాస్తవం కాదని, ఎక్కువ చేసి చెబుతున్నారని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధి నమోదైందని చెప్పుకోవడం సరికాదు. ఏపీకి ఒక్క ఐటీ పరిశ్రమ కూడా రాలేదు. పరిశ్రమలు మూత పడుతున్నాయి. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 10.99 శాతం వృద్ధి ఎలా సాధ్యమైంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అడ్వాన్స్‌డ్ ఎస్టిమేట్స్. వాస్తవ గణాంకాలు రావడానికి నాలుగేళ్లు పడుతుంది. అప్పటికి ఏదో ఒకటి బొంకవచ్చనే అబద్ధాలు చెబుతున్నారు. వృద్ధిరేటుకు, ప్రభుత్వ రాబడికి సంబంధం ఉంటుంది. కేంద్రంలో 7.3 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తే, రాబడి 22 శాతం పెరిగింది. మన వృద్ధిరేటు 10.99 శాతం ప్రకారం చూస్తే 30 శాతం రాబడి పెరగాలి. కానీ, పెరిగింది కేవలం 13 శాతమేనని సీఎం డాష్‌బోర్డులో చూపించారు. ప్రభుత్వం చెబుతున్న వృద్ధిరేటను చూసి కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది? తప్పుడు సంకేతాలు వెళ్లవా?

 విశాఖకు ఒక్క ఐటీ కంపెనీ అయినా తెచ్చారా?
 హీరో మోటార్ కార్ప్ ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామంటే.. వాళ్లతో చంద్రబాబు ఫొటోలు దిగారు. ఏషియన్ పెయింట్స్ వాళ్లలోనూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ రెండు కంపెనీలు ఏమయ్యాయి? విశాఖ పట్నానికి ఒక్క ఐటీ కంపెనీ అయినా తెచ్చారా?  

 సొంత ఇమేజ్ కోసం భారీగా ఖర్చు
 చంద్రబాబు సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం సబబా? రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు ఖర్చుపెట్టారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ప్రైవేట్ విమానాల్లోనే తిరుగుతున్నారు. విదేశీ పర్యటనలకు భారీ సైన్యంతో వెళుతున్నారు.   వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు చూసి ఏమనుకుంటాయి? మన వద్ద చాలా డబ్బులు ఉన్నాయనుకోరా? సొంత ఇమేజ్ పెంచుకోవడం చేస్తున్న  ఖర్చు కొంపముంచడం ఖాయం.

 చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ  
 క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఆర్‌డీఏ)ని చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్చేశారు.  సింగపూర్ కంపెనీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇచ్చిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీకి ప్రభుత్వం రూ.12 కోట్లు చెల్లించింది.  

 సీబీఐ విచారణ జరిపించండి
 రాజధాని భూ కుంభకోణంపై ఎంతసేపు మాట్లాడినా.. ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు అంగీకరించలేదు. సీబీఐ విచారణ అంటే.. తేలు కుట్టిన దొంగల్లా వెనక్కిపోతున్నారు, ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబు ఆరోపణలు చేసినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. నిజాయితీ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు అంగీకరించారు. రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామంటూ ప్రమాణం(ఓత్ ఆఫ్ సీక్రసీ) చేసిన ముఖ్యమంత్రి... దాన్ని ఉల్లంఘించారు. రాజధాని భూదందాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబే అసలు నిందితుడు.  
 
 కమీషన్లపైనే ఎక్కువ శ్రద్ధ...
 పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఆసక్తి లేదు. కమీషన్ల మీదే ఎక్కువ శ్రద్ధ. పనులు నత్తనడకన సాగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) 2015 ఆగస్టులో ప్రభుత్వానికి లేఖ రాసింది. 2015 జనవరి నుంచి జూన్ వరకు 2 శాతం పనులే జరిగాయని పేర్కొంది. పనులు చేసే సత్తా కాంట్రాక్టర్‌కు లేదనీ స్పష్టం చేసింది. 2015 అక్టోబర్ 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ప్రాజెక్టు పనులను సమీక్షించారు. ఇప్పటిదాకా 5.52 శాతం పనులే జరిగాయని మంత్రివర్గం దృష్టికి వచ్చింది. కాంట్రాక్టర్‌కు పనిచేసే సామర్థ్యం లేదని తేల్చింది. కాంట్రాక్టర్‌ను తొలగించి, మళ్లీ టెండర్లు పిలవాలి. కాంట్రాక్టర్‌ను తొలగించాల్సింది పోయి, ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ మీద తెచ్చుకోవచ్చని నిర్ణయం తీసుకున్నారు. దానిపై సంతకాలు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు భయపడ్డారు. కాంట్రాక్టర్‌కు ధరలు పెంచి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంధనం, స్టీలు, అల్యూమినియం రేట్లు తగ్గాయి. ఫలితంగా ధరలు తగ్గాలి. కానీ, విచిత్రంగా పెంచారు. కొత్తగా టెండర్లు పిలిస్తే తక్కువ ఖర్చుతో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తారు.

 పోలవరం కుడికాల్వ 7వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.23 కోట్ల విలువైన పనులను చంద్రబాబు బినామీ బొల్లినేని శీనయ్య కంపెనీకి రూ.74 కోట్లకు ఇచ్చారు. దీనిపై సంతకాలు చేయడానికి ఇద్దరు సీఎస్‌లు భయపడ్డారంటే.. పాలకులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.
 
 ఈ ప్రశ్నలకు బదులేది..?
► రాజధాని ఎక్కడ వస్తుందో మీకు, మీ బినామీలకు తప్ప ఎవరికీ చెప్పకుండా ఉండటం న్యాయమేనా?
► రాజధానిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామంటూ పలు పేర్లు చెప్పడం మోసం కాదా?
► రాజధాని రైతుల దగ్గర మీ బినామీలు
► తక్కువ ధరలకు భూములు కొనలేదా?
► మీ బినామీల భూములకు డిమాండ్ సృష్టించడానికి వాటిని రియల్ జోన్‌లో పెట్టలేదా?
► అసైన్డ్, లంక భూములను కొనడం నేరమని తెలిసినా కొనలేదా?
► రైతులను భయపెట్టి తక్కువ ధరలకు భూములను లాక్కోలేదా?
► రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకు భూములు కొని పేదలను మోసం చేయలేదా?
► టీడీపీ నేతలంతా భూములను కొన్న తర్వాతే రాజధాని ప్రకటన చేయలేదా?
► ఫలానా చోట రాజధాని వస్తుందని తెలిసీ, భూములు కొన్న తర్వాత రాజధానిని ప్రకటించడం ధర్మమేనా?
► అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ కింద పరిహారానికి సంబంధించిన జీవో 41ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇవ్వలేదా?
► ఎస్టీ, ఎస్సీలు, బడుగులకు చెందిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయవచ్చంటూ చట్టంలో దిక్కుమాలిన మార్పులు చేసేందుకు ప్రయత్నించడం వాస్తవం కాదా?
► రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.2 వేల కోట్లను మళ్లించి, సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం ధర్మమేనా?
► సింగపూర్ ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తుందని మొదట చెప్పి, ఇప్పుడు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చేస్తాయని చెప్పడం మోసం కాదా?








మిగతా హామీలు...
  రైల్వే జోన్ మంజూరు చేస్తామని, పెట్రో కెమికల్ కారిడార్, కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మూడు బడ్జెట్లు పోయాయి. వాటి ఊసు ఎక్కడా కనిపించలేదు. కానీ, చంద్రబాబు మాత్రం అదిగో జోన్, ఇదిగో కారిడార్,
 అల్లదిగో స్టీల్‌ప్లాంట్ అంటూ ప్రజలను ఊరిస్తూనే ఉన్నారు.
 
 హామీలు ఏమయ్యాయి?
 హామీ-1
 రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. ఇక మిగిలింది రెండు బడ్జెట్లే. పార్లమెంట్‌లో ఓటేసి మరీ రాష్ట్రాన్ని విడగొట్టినవారిలో అప్పటి అధికార పక్షం కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షంలో టీడీపీ కూడా ఉంది. విడగొట్టినప్పుడు పార్లమెంట్ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి హామీలు ఇచ్చాయి. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు, హైదరాబాద్ లాంటి నగరాన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి నష్టపరిహారంగా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014 మార్చి 2న కేంద్రంలో అప్పటి ప్రభుత్వం మంత్రివర్గంలో తీర్మానం చేసింది. హోదా కల్పించాలంటూ ప్రణాళికా సంఘాన్ని అప్పటి ప్రధానమంత్రి ఆదేశించారు. ఆదేశాలు ఇచ్చి 24 నెలలు గడిచిపోయాయి. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చి 15 నెలలు దాటింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఉండే విధంగా తెస్తామంటూ ఇదే అసెంబ్లీలో గవర్నర్‌తో తొలి ప్రసంగంలో చెప్పించారు. రెండేళ్లు గడిచిపోయాయి. ప్రతీ సందర్భంలో ఏదో ఒకటి చెబుతూ కాలం గడిపేస్తున్నారు.
 
 హామీ-2
పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం రెండో హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని గవర్నర్‌తో తొలి ప్రసంగంలో చెప్పించారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు పోలవరం ఫేజ్-1 పూర్తి చేస్తామని కొత్తగా చెబుతున్నారు. పోలవరంలో ఫేజ్-1 ఉందనే విషయం ఎవరికీ  తెలియదు. పోలవరం ప్రాజెక్టులో కట్టినంత వరకు ఫేజ్-1 అంటారో, లేక పట్టిసీమనే ఫేజ్-1 అంటారో తెలియదు. చంద్రబాబు కాలయాపన చేస్తూనే ఉన్నారు.
 
 హామీ-3
 రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మరో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్యాకేజీ తెస్తామని ఊదరగొడుతున్నారు. ప్యాకేజీ వస్తుందని, అభివృద్ధి జరుగుతుందని ఆ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు.
 
 హామీ- 4

 రాష్ట్రంలో రిసోర్స్ గ్యాప్ ఉంటే దానికి పరిహారం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఇక్కడ బీద ఏడుపులు ఏడుస్తారు. ఢిల్లీలో మాత్రం బ్రహ్మాండంగా పొగిడి వస్తారు. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదు. సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వెళ్తున్నారో, ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటానికి వెళుతున్నారో తెలియడం లేదు. రిసోర్స్ గ్యాప్‌కు సంబంధించిన పరిహారం వస్తుందని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
 
 హామీ- 5
 రాజధాని నిర్మాణానికి అటవీ భూమిని డీనోటిఫై చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. గుంటూరు జిల్లాలోని వినుకొండలో 20 వేల ఎకరాల అటవీ భూములున్నా చంద్రబాబు వద్దంటారు. తన బినామీల కోసం ల్యాండ్ పూలింగ్ ముద్దంటారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం వనరులిచ్చి చేయమంటే.. వద్దని బాబు అంటున్నారు. రెండేళ్లయినా ఒక్క ఇటుకా పడలేదు.

మరిన్ని వార్తలు