మాఫీ కాదు... దగా చేశారు

10 Mar, 2016 03:01 IST|Sakshi
మాఫీ కాదు... దగా చేశారు

ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు
అధికారంలోకి వచ్చాక రైతాంగాన్ని నిలువునా ముంచారు
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం లేదు
అసెంబ్లీలో ఏపీ సర్కారును నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

 సాక్షి, హైదరాబాద్: దారుణమైన అబద్ధాలు చెబుతున్న ఏపీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కాక రైతుల్ని నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రుణమాఫీపై మాట్లాడారు. జగన్ మాట్లాడుతున్నంత సేపూ అధికార పక్షం పదేపదే అడ్డు తగిలింది. ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడాల్సిన అవసరం లేదని జగన్ మైక్‌ను స్పీకర్ పలుమార్లు కట్ చేశారు. పలు అవాంతరాల మధ్యే జగన్ ప్రసంగించారు.

ఒకదశలో మాఫీపై సభలో అరగంట సేపు తీవ్ర వాగ్వా దం జరిగింది. ఎన్నికల ముందు రైతులకు అబద్ధాలు చెప్పి, ఆ తర్వాత మోసం చేసి వాళ్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ తన సహచర సభ్యులతో కలిసి వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ... ‘‘ఎన్నికల వేళ రైతులతో ఓట్లు వేయించుకోవడానికి... బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. ఎన్నికలప్పుడు ఎక్కడ చూసినా ఇవే ప్రకటనలు. ఏ గోడలపై చూసినా ఇవే రాతలు. గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు పెట్టారు. ప్రజలకు కనిపించవేమోనని ఆ ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టారు. బాబు ఏ సభలో మాట్లాడినా రుణమాఫీ చేస్తామన్నారు. రైతులను నమ్మించారు. అధికారంలోకి రాగానే దగా చేశారు’’ అని నిప్పులు చెరిగారు.

 సాగు రుణాలకే మాఫీ: ప్రత్తిపాటి
మాఫీపై ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూటిగా సమాధానం ఇవ్వలేదు.   మాఫీ తప్పక చేస్తామన్నారు. బంగారాన్ని వేలం వేస్తామంటూ బ్యాంకులు నోటీసులు జారీ చేసిన విషయం తమకు తెలియదన్నారు. పంటల సాగు కోసం తీసుకున్న బంగారం రుణాలకే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

 నోటీసులందలేదనడం దుర్మార్గం: కల్పన
బంగారు నగలను వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తే, అవి తమ దృష్టికి రాలేదని వ్యవసాయ మంత్రి చెప్పడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష ఉపనేత ఉప్పులేటి కల్పన విమర్శించారు. నోటీసులు తీసుకున్న మహిళలు ప్రతిరోజూ మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తూనే ఉన్నారన్నారు. బంగారం రుణాలు పంటల సాగు కోసం కాదనడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.

చంద్రబాబు బావకే రుణం మాఫీ కాలేదు
‘‘తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని చంద్రబాబు చెప్పడం వల్ల రైతులు చెల్లించడం ఆపేశారు. ఆ రైతులకు అప్పటివరకు రూ.లక్ష లోపు రుణాలకు వడ్డీ ఉండేది కాదు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ  ఉండేది. టీడీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు రుణ పరపతి  పోయింది. చంద్రబాబు రుణాలు కట్టొద్దు అని చెప్పడం వల్ల ఇప్పుడు అపరాధ వడ్డీ కింద బ్యాంకులు 14 నుంచి 18 శాతం రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. బాబు సీఎం అయ్యేనాటికి రూ.87,612 కోట్ల రైతు రుణాలు ఉన్నాయి. ఈ రుణాలపై రైతులు రెండేళ్లలో చెల్లించాల్సిన వడ్డీ రూ.24 వేల కోట్లు. ఈ రెండేళ్లలో బాబు ముష్టి వేసినట్లు ఇచ్చిన సొమ్ము రూ.7,300 కోట్లే. ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోని పరిస్థితి. ఇక బాబు సొంత బావకే రుణం మాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్యాంకుల్లోని రైతుల బంగారాన్ని వేలం వేస్తామంటూ రోజు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు’’ అంటూ సర్కారు వైఖరిని జగన్ ఎండగట్టారు.

>
మరిన్ని వార్తలు