వాకౌట్ చేసేందుకూ అవకాశం ఇవ్వరా?

16 Mar, 2016 12:37 IST|Sakshi
వాకౌట్ చేసేందుకూ అవకాశం ఇవ్వరా?

వాకౌట్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షం తీవ్ర ఆందోళనకు దిగింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఇది చోటుచేసుకుంది. ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకు వెళ్లే ముందు తమను గమనించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. సబ్జెక్టుపై నిరసన తెలిపే అవకాశాన్ని తమకు కల్పించాలని ఆయన కోరారు. తాము చేతులు ఎత్తుతున్నా.. ఇటువైపు చూడకుండా మరోప్రశ్నకు అవకాశం ఇవ్వడం సరికాదని అన్నారు. కనీసం రేపటినుంచైనా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. అసెంబ్లీలో తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అబద్ధాలు చెబితే తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వరా అని వైఎస్ జగన్ అన్నారు. మైనార్టీ సంక్షేమం, మహిళా సాధికారతపై తమ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు చెప్పిన సమాధానాలు తమకు సంతృప్తి కలిగించలేదని చెప్పారు. దీనిపై నిరసన తెలిపే హక్కు తమకు ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకపోతే ఎలాగని అన్నారు. అప్పటికే వైఎస్ఆర్‌సీపీ సభ్యులు పోడియం ఎదుట బైఠాయించారు. దాంతో సభ్యులను వెనక్కి వెళ్లాల్సిందిగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడికి తాను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దాంతో మంత్రి యనమల విజ్ఞప్తిని అంగీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష సభ్యులు ఆందోళనను విరమించారు.

అంతకుముందు.. మైనారిటీ సంక్షేమ నిధుల వ్యవహారంలో లెక్కలు తప్పుగా చెప్పిన అధికార పక్షం ఇరుకున పడింది. సంక్షేమం అంకెలపై తానిచ్చిన వివరణకు కట్టుబడి ఉన్నానని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. ఆయన సవాలుకు వైఎస్ఆర్‌సీపీ తాము సిద్ధమని తెలిపింది. మంత్రి పల్లె వివరాలు చెప్పబోతుండగా.. మరో మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుకున్నారు. పల్లె రఘునాథరెడ్డి సవాలుపై చర్చ సాగనీయకుండా అధికార పక్షమే అడ్డుకుంది. దాంతో సవాలు నుంచి పారిపోతున్నారంటూ సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. సంక్షేమ నిధులపై చర్చకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది.

మరిన్ని వార్తలు