ఎట్ హోంలో ఇద్దరు సీఎంలు

16 Aug, 2016 01:36 IST|Sakshi
ఎట్ హోంలో ఇద్దరు సీఎంలు

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు..
ఇరు రాష్ట్రాల మండలి చైర్మన్లు.. అసెంబ్లీ స్పీకర్లు కూడా

సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల సం దర్భంగా గవర్నర్ నరసింహన్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఇద్దరు కేవలం పలకరింపులకే పరిమితమయ్యారు. మరోవైపు తొలిసారిగా ఈ కార్యక్రమానికి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎట్ హోమ్‌కు హాజరు కావడం సంతోషం కలిగించిందని  జగన్‌తో గవర్నర్  అన్నారు. ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్‌రావు, మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, కేంద్రమంత్రులు దత్తాత్రే య, సుజనాచౌదరి, డిప్యూటీ సీఎంలు మహమూద్  అలీ, శ్రీహరి, పలువురు మం త్రులు, ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

జగన్‌తో కేసీఆర్ కరచాలనం
వైఎస్ జగన్ ఎట్ హోం కార్యక్రమానికి హాజరై వెళ్తున్న సమయంలో సీఎం కేసీఆర్ ఆయనతో కరచాలనం చేశారు. తెలంగాణ మంత్రులూ వీడ్కోలు పలికేందుకు లేచి కరచాలనం చేశారు. ఇదే సమయంలో వైఎస్ జగన్, చంద్రబాబు కూడా కరచాలనం చేసుకున్నారు. ఇద్దరు సీఎంల నడుమ గవర్నర్  కాసేపు కూర్చున్నారు. ఈ సమయంలో సీఎం లు ఏమీ మాట్లాడుకోలేదు. అతిథులను కలిసేందుకు గవర్నర్ వెళ్లిపోవడంతో చంద్రబాబు.. సుజనా చౌదరితో, కేసీఆర్.. దత్తాత్రేయతో మాట్లాడుతూ కనిపించారు. గవర్నర్ సతీమణి విమలానరసింహన్ కొద్దిసేపు జగన్‌తో మాట్లాడారు. ఎట్ హోం నుంచి తొలుత జగన్ వెళ్లగా..  కాసేపటికే చంద్రబాబు వెళ్లిపోయారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో సుజనా చౌదరి మాట్లాడుతూ కూర్చున్నారు.

సంతృప్తి చెందారా: మీడియాతో గవర్నర్
ఇద్దరు సీఎంలను వెంట బెట్టుకుని బయటకు వచ్చిన గవర్నర్ నరసింహన్ మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. గత ఏడాది ఎట్ హోం సమయంలో ఇద్దరి గైర్హాజరీపై వచ్చిన ప్రశ్నలను గుర్తు చేస్తూ .. ‘‘ఈసారి మీకు ఆ అవకాశం లేదు.. మీరు సంతృప్తి చెందినట్టేనా’’ అని నవ్వుతూ ప్రశ్నించారు. ‘ఫుల్ మూన్’ అంటూ మీడియా ప్రతినిధులు అనడంతో ‘మీరు ఎక్కువ ఆశిస్తున్నట్టుంది..’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ‘ఇది ఎట్ హోం’ అంటూ ముందుకు కదిలారు.

ఎట్ హోం ముగిశాక కేసీఆర్, గవర్నర్ రాజ్‌భవన్‌లోకి వెళ్తూ కొద్దిసేపు మీడియా ప్రతి నిధుల వద్ద ఆగారు. ఈ సందర్భంగా ‘‘సీఎం కేసీఆర్‌ను మీకు అప్పగిస్తున్నాను..’’ అంటూ గవర్నర్ సరదాగా అన్నారు. అనంతరం సీఎం మీడియా ప్రతినిధులతో ఫొటోలు దిగారు. ఇదే సమయంలో జర్నలిస్టుల ఇళ్ల సమస్యను ఆయనే ప్రస్తావిస్తూ.. ‘త్వరలోనే చేసేద్దాం..’ అంటూ ముందుకు కదిలారు. ఎట్ హోంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్,  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ పాల్గొన్నారు. టీకాంగ్రెస్, టీడీపీ నేతలు హాజరు కాలేదు.

మరిన్ని వార్తలు