10 శాతం హామీలైనా నెరవేర్చారా?

11 May, 2018 03:03 IST|Sakshi

చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్న

బాబు తొలి ఐదు సంతకాలకు విలువే లేకుండా పోయింది

చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు

14, 15 తేదీల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో శ్రేణుల పాదయాత్ర

సాక్షి, హైదరాబాద్‌: నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 2014, ఆగస్టు 15న 13 జిల్లాల ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చారని, జిల్లాల వారీగా పరిశీలిస్తే వాటిలో 10 శాతం కూడా అమలు కాలేదనేది స్పష్టం అవుతోందని ఆయన అన్నారు.

ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఈ నెల 14వ తేదీ నాటికి వైఎస్‌ జగన్‌ 2,000 కిలో మీటర్ల మైలురాయిని పశ్చిమగోదావరి జిల్లాలో అధిగమించబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రంలోని 175 శాసనసభా నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచనలు జారీ చేసింది. పాదయాత్ర ముగిసిన మరుసటి రోజు ఆయా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ పేర్కొంది.

పాదయాత్రలు చేస్తున్నపుడు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నపుడు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటూ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాలను కేంద్ర కార్యాలయం ఒక సర్క్యులర్‌ రూపంలో పార్టీ శ్రేణులకు పంపింది.

చంద్రబాబు వైఫల్యాలలో ప్రధానమైనవి..
13 జిల్లాలకు ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా నెరవేర్చక పోగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు తీసుకుని ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేక పోయింది.
  కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, మొత్తంగా విభజన చట్టం అమలే నాలుగేళ్లుగా ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీయే చెబుతూండటం ఆ పార్టీ అతి పెద్ద వైఫల్యం.
  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదికలు చెబుతున్న విషయాన్ని ఉటంకించాలి.
 చంద్రబాబు పాలనలో శాండ్, ల్యాండ్, మైనింగ్, లిక్కర్‌ మాఫియాలు ప్రతి గ్రామంలోనూ విజృంభిస్తున్నాయి.
 ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల్లో భాగమైన బెల్ట్‌షాపులు మూతపడలేదు. ఇంటింటికీ 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇవ్వడంలేదు. పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు. డ్వాక్రా రుణాల మాఫీయే లేదు కాబట్టి ఆ సంతకాలకు విలువే లేకుండా పోయింది.
 వ్యవసాయ, వ్యవసాయ ఆధార రంగాల వారికి ఇచ్చిన వాగ్దానాలు, మహిళలకు, నిరుద్యోగులకు, వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు.
 నిన్న మొన్నటి వరకూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి.. కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూంటే వాటిని ఆపే శక్తి ఓటుకు కోట్లు కేసు ఫలితంగా చంద్రబాబుకు లేకుండా పోయింది.
 పోలవరం ప్రాజెక్టును 2017 నాటికే పూర్తి చేస్తానని నమ్మించిన చంద్రబాబు.. చివరకు ఘోరంగా విఫలమయ్యారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ గడిచిన మూడు నెలల్లోనే ఆ రెండు పార్టీలతో వేరుపడిన పరిస్థితి కూడా బాబు పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం.
 రాష్ట్రంలో 3,600 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయంటే ఇంతకు మించిన వైఫల్యం మరొకటి ఉండదు.
 పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. అధికారంలోకి రాగానే జీవో నంబర్‌ 22 ద్వారా కాంట్రాక్టర్లకు చంద్రబాబు కమీషన్లు పెంచారు తప్ప జలయజ్ఞం ప్రాజెక్టులేవీ ఈ రోజుకూ పూర్తి కాలేదు.
 ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లు, మెస్‌ చార్జీలు గానీ నాలుగేళ్ల పాటు పెంచని పరిపాలన చంద్రబాబుదే.
 అతి తక్కువ గృహాలను (2.5 లక్షలు) నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇంత తక్కువ నిర్మాణాలు మరే ప్రభుత్వంలోనూ జరగలేదు.
   రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకున్నా అందులో 5 శాతం కూడా పెట్టుబడులుగా మారలేదు. మరో వైపు 20కి పైగా విదేశీ పర్యటనలు చేసినా అక్కడి నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి రాకపోగా.. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది.
   మొత్తం మీద రాజధాని వైఫల్యం, విభజన హామీల అమలులో వైఫల్యం, ఎన్నికల ముందు, ఆ తరువాత ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం ఇలా అన్ని రకాలుగా చంద్రబాబు వైఫల్యం చెందారు. సాచ్యురేషన్‌ విధానంలో పథకాలను అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఊరూ, వాడా విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్‌ జగన్‌ సూచించారు.

మరిన్ని వార్తలు