'రాయలసీమకు పూర్తిగా అన్యాయం'

14 Nov, 2015 14:37 IST|Sakshi
'రాయలసీమకు పూర్తిగా అన్యాయం'

హైదరాబాద్: ఏపీ సర్కార్ మాటలకే పరిమితమైందని, వారి చేతలు శూన్యమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ విమర్శించారు. హైదరాబాద్ లోని లోటస్పాండ్లో కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేతలు వైఎస్ జగన్తో శనివారం నాడు చర్చించారు. ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మేథోమధనం చేస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పారిశ్రామిక రాయితీలు కేవలం అమరావతి ప్రాంతానికే కావాలని ఏపీ సీఎం కోరడం దుర్మార్గమని పార్టీ నేతలు మండిపడ్డారు.

టీడీపీ వ్యతిరేకపాలనను ప్రజల్లోనే ఎండగడతామని వారు పేర్కొన్నారు. టీడీపీ పాలనలో రాయలసీమకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ ఈ సమీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు