ఇది ప్రజాస్వామ్యమేనా?

4 Apr, 2017 00:19 IST|Sakshi
ఇది ప్రజాస్వామ్యమేనా?

ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణం చేయించడం ధర్మమా?
గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ ప్రశ్న


- అధికారపక్షం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
- ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా చూడండి
- ఆ రాజీనామాలు ఆమోదించేలా చూడాల్సింది మీరే
- లేదంటే అనర్హులుగానైనా చేయండి.. ఆ బాధ్యత మీదే
- గవర్నర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ బృందం
- ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్న ప్రతిపక్షనేత
- ఈ అప్రజాస్వామిక పోకడలను వదిలేది లేదని స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్‌: ఒక పార్టీ (వైఎస్సార్‌ కాంగ్రెస్‌) గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ (టీడీపీ) ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం, చేయించడం ధర్మమేనా! అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.  జగన్‌ సోమవారం సాయంత్రం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, వై.బాలనాగిరెడ్డి, రాష్ట్ర పార్టీ ఎస్‌.సి విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జునతో కలసి ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించ డంపై అభ్యంతరం తెలిపారు. గవర్నర్‌తో జగన్‌ బృందం కొద్ది సేపు సమావేశమై ఆయనకు ఓ వినతి పత్రం కూడా సమర్పించింది.

అనంతరం జగన్‌ రాజ్‌భవన్‌ బయట మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి ఎన్నిౖకైన వారిని మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఎలా తీసుకుంటారని తాము ప్రశ్నించామని, తెలంగాణలో గతంలో తలసాని శ్రీనివాసయాదవ్‌ను అక్కడి ప్రభుత్వం మంత్రిగా చేసినపుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం మాట్లాడారో గవర్నర్‌కు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ..... ఇది ధర్మమేనా! ప్రజాస్వామ్యమేనా అని అడిగామన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బలం 66 అని స్పీకర్‌ ప్రకటించారు
మొన్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున సభను నిరవధికంగా వాయిదా వేస్తూ... చనిపోయిన భూమా నాగిరెడ్డిని మినహాయించి, శాసనసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బలం 66 మంది అని సాక్షాత్తూ ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు తన నోటివెంటే చదివి వినిపిం చారన్నారు. స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన వారిని అనర్హులు కాకుండా కాపాడుతూ ఉన్నారు. మరో వైపు ఏమో... ఓ అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఏకంగా మంత్రి పదవులు ఇవ్వడం అన్యాయం, అధర్మం కాదా? అని జగన్‌ ప్రశ్నించారు.

ఫిరాయింపు దారులు అనర్హులయ్యేలా చూడండి
ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేట్లుగా చేయండి. వారు చేసిన రాజీనామా లు ఆమోదించేలా చర్యలు తీసుకోండి. వారు ఇవేవీ చేయకపోతే మీరే (గవర్నర్‌) దగ్గరుండి అలా పార్టీ మారిన వారిని అనర్హులుగా చేయడానికి చర్యలు తీసుకోండి అని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజా స్వామ్యంలో ఇలాంటి తప్పులు జరక్కుండా చూసేందుకే గవర్నర్‌ అనే వ్యక్తి ఉంటారని, తప్పులు జరుగుతున్నపుడు వాటిని అరికట్టేందుకు గవర్నర్‌ పదవి ఉపయోగపడు తుందని జగన్‌ అన్నారు. అయితే అలాంటి గవర్నర్‌ చేతనే ఇలాంటి దారుణాలు చేయిస్తే ... ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? ప్రజాస్వామ్యం ఎలా బతుకుంది? అని ప్రశ్నించామని దయ చేసి ఆలోచన చేయాలని గట్టిగా కోరామని జగన్‌ అన్నారు.

ఉప ఎన్నికల దాకా తీసుకువెళతాం
గవర్నర్‌కు ఇచ్చిన వినతి పత్రం ప్రతిని జగన్‌ చూపిస్తూ... దీన్ని ఇంతటితో వదలమని, తమ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకు వెళ్తామన్నారు. భారత రాష్ట్రపతిని కలవడానికి ఆయన అపాయింట్‌మెంట్‌ అడిగామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను, వివిధ రాజకీయ పార్టీలనూ కూడా కలుస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌ మెంట్‌ కూడా అడుగుతామని, ఆయన కనుక అవకాశం ఇస్తే ‘మీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి (చంద్రబాబు) ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంటే మీకు చెడ్డ పేరు రాదా?’ అని ఆయన దృష్టికి కూడా తీసుకు వెళతామన్నారు.

జాతీయ స్థాయిలో ప్రతి రాజకీయ పార్టీ వద్దకూ వెళ్లి ‘ఇవాళ మా విషయంలో ఇలా జరిగింది. మీకు సంబంధించిన విషయం కాదులే అని మీరు మౌనంగా ఉండవద్దు. ఇదే విషయం రేప్పొద్దున మీ దాకా కూడా వస్తుంది. రేపు మీ పార్టీలో ఉన్న వారిని కూడా వేరే పార్టీలు ఇలాగే లాగేసుకునే పని చేస్తాయి. అలా జరిగినపుడు ప్రజాస్వామ్యం పూర్తిగా చతికిల పడుతుంది. కాబట్టి దయచేసి ఈ అప్రజాస్వామిక పోకడలపై స్పందించండి’ అని వారి మద్దతు కూడా తీసుకుంటామన్నారు. ఇంతటితో దీన్ని వదలి పెట్టమని, ఈ నలుగురిచేత రాజీనామాలు చేయించేట్టుగా చేస్తామని, వాటిని ఆమోదించే విధంగా కూడా చేస్తామన్నారు. కచ్చితంగా ఉప ఎన్నికలకు కూడా పోతామన్నారు. ఉప ఎన్నికల్లో... పైన దేవుడున్నాడు, ప్రజలున్నారు. మాకు వాళ్ల మీద నమ్మకం, విశ్వాసం ఉంది.

పై నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. తప్పక మంచే జరుగుతుందని జగన్‌ అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఢిల్లీ స్థాయిలో తమకు మద్దతు లేదని, మద్దతు లేక పోవడం మా ఖర్మ అని జగన్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటమే ఒక పాపం అన్నట్లుగా అధికారంలో ఉన్న వాళ్లు అహంకారంతో ప్రతిపక్షాన్ని కొట్టడం మొదలు పెడితే, దాన్ని అందరమూ చూస్తూ ఊరుకుంటే ఇక ప్రజాస్వామ్యం బతకదు అని జగన్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘అధికారంలో ఉన్న వారు ఏదైనా చేస్తూ పోతారు... అధికారంలో లేని వారు దాన్ని భరిస్తూ పోవాలి అనంటే ... ఏదో ఒక రోజు తిరుగుబాటు ఎక్కడో ఒక దగ్గర నుంచి మొదలవుతుంది’ అని ఆయన అన్నారు. నిరసన కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించగా ఈ విషయంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏఏ కార్యక్రమాలు చేయా లో అవన్నీ చేస్తామని జగన్‌ తెలిపారు.

రాజకీయ వ్యభిచారులని నాడు బాబు అనలేదా..?
శ్రీనివాస్‌ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చినపుడు... ఒక పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా, వారు అనర్హులు కాకుండా.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిని రాజకీయ వ్యభిచారులుగా చంద్రబాబు పోల్చారు. ఆరోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఇవాళ ఆయన చేష్టలు రెండూ సబబేనా అని గట్టిగా అడిగామన్నారు. ‘సార్‌. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు, ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం చాలా తప్పు’ అని గవర్నర్‌కు చెప్పామన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా