చాట్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

18 Dec, 2015 13:05 IST|Sakshi

హైదరాబాద్: నాటక రంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు నాటక రంగానికి ఆయన ఎనలేని కృషిచేశారని కొనియాడారు. ఆయన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఆయన సేవలను తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వైఎస్ జగన్ తెలిపారు.

తీవ్ర అనారోగ్యంతో చాట్ల శ్రీరాములు శుక్రవారం మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. చాట్ల శ్రీరాములు రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ 1976లో నాటక రంగానికి అంకితమయ్యారు. ఆయన దేశవిదేశాల్లో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు.

కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు ఎన్టీఆర్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను చాట్ల శ్రీరాములు అందుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటులు వెంకటేశ్, నాగార్జున, రామ్లకు చాట్ల శ్రీరాములు నటనలో శిక్షణ ఇచ్చారు. 1931లో చాట్ల శ్రీరాములు విజయవాడలో జన్మించారు.

మరిన్ని వార్తలు