ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి

21 Sep, 2016 02:52 IST|Sakshi
ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి

* టీఆర్‌ఎస్‌లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
* ఇప్పటికైనా నోటీసులిచ్చి వారిని అనర్హులుగా ప్రకటించాలి
* మీడియాతో పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్

సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో చేరిన తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుకు వెంటనే నోటీసులిచ్చి, అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై చర్య తీసుకోవడంలో జాప్యం చేయొద్దని కోరింది. తమ పిటిషన్‌లో చేసిన ప్రధాన అభ్యర్థనకు అనుగుణంగా వారిపై అనర్హత వేటు వేయడంతో పాటు, మధ్యంతర ఉత్తర్వుల కోసం కోరిన విధంగా ఈ ముగ్గురు సభ్యులు శాసనసభ సమావేశాల్లో పాల్గొనకుండా వెంటనే సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలోని కార్యాలయంలో స్పీకర్‌ను కలుసుకుని ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ పార్టీ ప్రతినిధి బృందం స్పీకర్ ఫార్మాట్‌లో పిటిషన్లను సమర్పించింది. ఈ పిటిషన్లతో పాటు పార్టీ ఫిరాయింపులకు సాక్ష్యాలుగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియో సాక్ష్యాలు, సీడీలు, ఇతర ఆధారాలను అందజేసింది. ప్రతినిధి బృందంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మహ్మద్ మతీన్ ముజాద్దాదీ, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, బండారు వెంకటరమణ, ఫజల్ అహ్మద్ ఉన్నారు.

తాము సమర్పించిన పిటిషన్లపై  స్పీకర్ స్పందిస్తూ సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారని వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో తనకు నచ్చిన పార్టీకి ఓటు వేసి తీర్పు చెప్పిన ఓటరు మనోభావాలను దెబ్బతీసేలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
 
వారిపై అనర్హత వేటు వేయాలి: రాఘవరెడ్డి, శివకుమార్
‘‘గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బీఫామ్‌పై గెలుపొంది.. టీఆర్‌ఎస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాల్సిందిగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు పిటిషన్లు ఇచ్చాం. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో రకంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈసారి కచ్చితంగా నోటీసులిచ్చి, ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని కోరాం. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశాం. బహిరంగంగా సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పించుకుని వారు టీఆర్‌ఎస్‌లో చేరిన దానికి వీడియో, ఇతర ఆధారాలున్నాయి.

పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోకపోతే స్పీకర్ పదవిపైనే మచ్చ పడుతుంది. తాము పార్టీపరంగా స్పీకర్‌కు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోకపోగా, టీఆర్‌ఎస్‌లో విలీనమవుతున్నట్లు ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వగానే స్పీకర్ కార్యాలయం ఆగమేఘాలపై విలీన బులెటిన్‌ను జారీ చేసింది. రాజకీయాల్లో పార్టీలు విలీనమవుతాయి తప్పించి, ఎమ్మెల్యేలు చేరితే పార్టీ విలీనమైనట్లు కాదన్న విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికే న్యాయస్థానాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై 28 సార్లు మొట్టికాయలు వేశాయి. ఈ పార్టీ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా స్పీకర్ వ్యవస్థ వెంటనే నోటీసులిచ్చి, వారిపై అనర్హత వేటు వేయాలని కోరాము’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ స్పీకర్‌ను కలసిన అనంతరం మీడియాకు చెప్పారు.

మరిన్ని వార్తలు