శంకుస్థాపనపై జగన్ ఊహించిందే నిజమైంది: అంబటి

23 Oct, 2015 12:54 IST|Sakshi
శంకుస్థాపనపై జగన్ ఊహించిందే నిజమైంది: అంబటి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫంక్షన్లా జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంధించిన ప్రశ్నలన్నీ వాస్తవమనే రీతిలో శంకుస్థాపన జరిగిందని అన్నారు.

నరేంద్ర మోదీ-చంద్రబాబు నాయుడు జోడీ ప్రజలను మోసం చేసిందని అంబటి ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని తెలుగు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని... వారి ఆశలపై గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు జల్లి వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను మోదీకి చెప్పడంలో చంద్రబాబు విఫలం అయ్యారన్నారు.

కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని అంబటి వ్యాఖ్యానించారు. నిన్న జరిగింది రెండు పండుగలు కాదని...రెండు వంచనలంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాపాలకు పవిత్రత ఆపాదించే ప్రయత్నం చేశారని, వేదికపై దళితుడు గానీ, రైతుకు గానీ అవకాశం ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు.

ఉద్దండరాయునిపాలెం కుట్రలు, కుతంత్రాలు, రాజీలకు వేదిగా మారిందని, రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకపోతే...రైతుల పంటలను తగలబెడుతున్నారని అంబటి అన్నారు.   ప్రత్యేక హోదా సాధించే వరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని అంబటి స్పష్టం చేశారు. కాగా ప్రత్యేక హోదాపై ప్రధాని స్పందించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కూడా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు