-

తాయిలాల కోసమే వెళుతున్నారు

25 Feb, 2016 02:48 IST|Sakshi
తాయిలాల కోసమే వెళుతున్నారు

* ముఖ్యమంత్రి పనితనం చూసి కాదు
* పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
* వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే తాయిలాల కోసమే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సీఎం పనితనం, అభివృద్ధిని చూసి కాదని చెప్పారు. బొత్స బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కోసమే తన వైపు ఎమ్మెల్యేలు వస్తున్నారంటున్న చంద్రబాబు ఈ రెండేళ్లలో ఏం అభివృద్ధి సాధించారో గుండెపై చెయ్యి వేసుకొని చిత్తశుద్ధితో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

డబ్బును ఎరగా చూపి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారే తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదని ఆరోపించారు. తాయిలాలు ఇస్తే ఎమ్మెల్యేలకు అందుతాయి కానీ ప్రజలకు ఒరిగేది ఏమిటో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలున్నా తన వైపు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, టీడీపీ టికెట్‌పై పోటీ చేయించాలన్నారు. వారు గెలిస్తే నిజంగా చంద్రబాబుకు ప్రజాదరణ ఉన్నట్లు అంగీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. నీతిమంతుడినని, నిబద్ధత గలవాడిననీ సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఇలాంటి అనైతిక చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని బొత్స ప్రశ్నించారు.

నలుగురో ఐదుగురో ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నంత మాత్రాన వైఎస్సార్‌సీపీ బలహీనపడదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీలో ఉంటే మైలేజీ ఉండదని భూమా నాగిరెడ్డి చెప్పడాన్ని విలేకరులు ప్రస్తావించగా... మైలేజీ అంటే ఏమిటి? ధనమా? అధికారమా? అభివృద్ధా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ఒక్క ఎమ్మెల్యేకు పదవిలో ఉండగా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దానం నాగేందర్ టీడీపీ తరపున ఎన్నికైతే రాజీనామా చేయించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని గుర్తుచేశారు.
 
ప్రజా సమస్యలపై చర్చేది?
విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రజా సమస్యలపై, సంక్షేమ పథకాల అమలుపై చర్చ ఏమాత్రం జరగలేదని బొత్స దుయ్యబట్టారు. సమావేశమంతా ఆత్మస్తుతి, పరనిందలతో సాగిందన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ అన్నట్లు వీడియోలో చూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని బొత్స సవాలు విసిరారు.

మరిన్ని వార్తలు