ఎన్టీఆర్‌పై చెప్పులేయించినోళ్లకు జగన్ మాటంటేనే కోపమొస్తోందా?

4 Jun, 2016 00:46 IST|Sakshi
ఎన్టీఆర్‌పై చెప్పులేయించినోళ్లకు జగన్ మాటంటేనే కోపమొస్తోందా?

- మంత్రులు, టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ నేత బొత్స ధ్వజం
- ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తినే జగన్ తన మాటల ద్వారా చెప్పారు
 
 సాక్షి, హైదరాబాద్: ఇప్పటికీ తమ ఆరాధ్యదైవమని చెప్పుకునే ఎన్టీఆర్‌పైనే చెప్పులు విసిరినోళ్లకు.. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క మాటంటేనే ఎందుకంత కోపం పొడుచుకొస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ప్రజల్లో నెలకొన్న అసంతృప్తినే జగన్‌మోహన్‌రెడ్డి తన మాటల ద్వారా చెప్పారని.. ఆయన అన్నమాటలు ప్రజాభిప్రాయం, ప్రజావాణి అని తెలిపారు. ‘‘దీక్షలంటూ పిల్లలతో ప్రతిజ్ఞలు చేయించడం కాదు.

ప్రజల దగ్గరకెళ్లండి. గ్రామాల్లోకి వెళ్లండి.. మీ పరిస్థితేంటో తెలుస్తుంది. ‘చెప్పు’ అనగానే టీడీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటు? మీ సంస్కృతేంది చంద్రబాబూ? మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మీ పార్టీలో అందరికీఆరాధ్యదైవం, సాక్షాత్తూ నందమూరి తారక రామారావును వైశ్రాయి హోటల్ ముందు చెప్పులతో కొట్టించిన ప్పుడు తెలియలేదా ఆ బాధ? ఎన్టీఆర్ సీఎం పదవిలో ఉన్నప్పుడే చెప్పులతో కొట్టించింది వాస్తవం కాదా? దానికేం జవాబు చెబుతారు?’’ అని తూర్పార బట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో టీడీపీ నేతలు మాట్లాడే భాష, వ్యవహారశైలి జుగుప్సాకరంగా ఉంటోందని మండిపడ్డారు. జగన్ మానసిక పరిస్థితి బాగాలేదంటున్న యనమల తన మానసిక పరిస్థితి పరిశీలించుకోవాలన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందంటున్న ఆయనే దేశంలో అందరికన్నా అధికంగా రాష్ట్ర అభివృద్ధి రేటు రెండంకెలకు చేరిందంటున్నారని.. అభివృద్ధి అంత బాగా ఉన్నప్పుడు ఖజానా ఖాళీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

 సిగ్గులేకుండా ఎదురుదాడా?
 సీఎం, మంత్రులు, టీడీపీ నేతలకు సంబంధించి రోజుకొక అవినీతి వెలుగులోకి వస్తుంటే సిగ్గులేకుండా.. వాటిని ప్రశ్నించేవారిపై ఎదురుదాడి చేస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం ఏం తీరని బొత్స మండిపడ్డారు. టీడీపీ, చంద్రబాబు రాజకీయాల్నే వ్యాపారమయం చేశారన్నారు. రాజ్యసభ ఎన్నికలకోసం తొలుత కొందరు ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్లా కొనడం.. టీడీపీకి దక్కే రాజ్యసభ పదవుల్ని సంతబేరంలా అమ్ముకోవడం వారి నైజమని విమర్శించారు. తాము మాత్రమే ఈ మాటలు చెప్పట్లేదని, సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి సోదరుడు, టీడీపీ మాజీమంత్రితోపాటు మరో టీడీపీ ఎస్సీ నేత పుష్పరాజ్ ఇవే ఆరోపణలు చేసినమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

 తనకోసం రాష్ట్రప్రయోజనాల్ని తాకట్టుపెట్టారు..
 చంద్రబాబు తన అవినీతి కార్యక్రమాలతో ఈ రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టారని బొత్స విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉండి, ఆ కేసు చార్జిషీటులో 23సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించాక.. దానికోసమని రాష్ట్రానికి నష్టం చేకూరేలా ఎగువరాష్ట్రం ప్రాజెక్టులు కడుతున్నా మాట్లాడలేదన్నారు.

మరిన్ని వార్తలు