‘హోదా’పై చంద్రబాబుది మోసం

22 May, 2016 02:34 IST|Sakshi
‘హోదా’పై చంద్రబాబుది మోసం

వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని సీఎం చంద్రబాబు చేస్తున్న వాదన మోసపూరితమైందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజలూ భావిస్తుంటే.. ‘గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు’గా చంద్రబాబు ఈ వాదన తీసుకురావడం శోచనీయమన్నారు.

ఎన్నికలకుముందు రాష్ట్రానికి కనీసం పదిహేనేళ్లు ప్రత్యేకహోదా కావాలన్న చంద్రబాబు అప్పుడెందుకు కావాలని కోరినట్లు, ఇప్పుడు ఏమీ ఒరగదని ఎందుకంటున్నట్లో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాకు 14వ ఆర్థికసంఘం అడ్డుపడుతోందని, నీతిఆయోగ్ అంగీకరించట్లేదని చెప్పడం దారుణమన్నారు. ఇది తెలుగు ప్రజల్ని నిలువునా మోసం చేయడమేనన్నారు.

 ఈశాన్య రాష్ట్రాలతో పోలికా?
 ప్రత్యేకహోదా పొందిన 11 రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయనే కొత్త వాదనను చంద్రబాబు చేస్తున్నారంటూ.. అసలు ఈశాన్యరాష్ట్రాలతో ఏపీని ఏరకంగా పోలుస్తారని పార్థసారథి ప్రశ్నించారు. అక్కడి ప్రత్యేక పరిస్థితుల్ని, భౌగోళిక స్థితిని పట్టించుకోకుండా చంద్రబాబు వాటితో ఏపీని పోల్చడమేమిటన్నారు.

 అవును, మబ్బులు పారిపోతాయ్...
 తనను చూసి తుపాను పారిపోయిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పార్థసారథి స్పందిస్తూ... నిజమే ఆయన్ను చూసి మబ్బులు పారిపోతాయి.. కరువు, ఎండలు మాత్రమే దగ్గరకు వస్తాయని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు