గడప గడపకూ ‘నవరత్నాలు’

18 Jul, 2017 02:03 IST|Sakshi
గడప గడపకూ ‘నవరత్నాలు’
- వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల వెల్లడి
రెండు దశల్లో ప్రచార కార్యక్రమాలు
‘నవ్యాంధ్రకు నవరత్నాలు’ కరపత్రాలు విడుదల
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడానికి రెండు దశల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్‌ నేతలు వెల్లడించారు. ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక రోజు నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించి నవరత్నాల గురించి పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి రోజైన సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకూ ‘నవ్యాంధ్రకు నవరత్నాలు’ కరపత్రాన్ని ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమం చేపడతామన్నారు.

వైఎస్‌ జగన్‌ ఇచ్చిన తొమ్మిది హామీలను పొందుపరుస్తూ రూపొందించిన ‘నవ్యాంధ్రకు నవరత్నాలు’ కరపత్రాన్ని ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మరో ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి సంయుక్తంగా సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం పార్టీ నేతలతో కలసి ధర్మాన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మోసపూరిత విధానాలతో వంచనకు గురైన ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఆగస్టు 10 నుంచి నియోజకవర్గ స్థాయిలో జరిగే పార్టీ సమావేశాల్లో కరపత్రం గురించి శ్రేణులకు పూర్తిగా వివరిస్తామన్నారు. వారు సెప్టెంబర్‌ 2 నుంచి గ్రామస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి 9 హామీల గురించి వివరిస్తారని, దాంతో పాటుగా టీడీపీ గత ఎన్నికల మేనిఫెస్టోను కూడా గడపగడపకూ అందజేసి, ఆ పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందీ చెపుతారని ధర్మాన తెలిపారు. ‘జగనన్న వస్తున్నాడు.. నవరత్నాలు తెస్తున్నాడు’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళతామన్నారు.