'అంగన్ వాడీల తొలగింపు అమానుషం'

23 Dec, 2015 20:32 IST|Sakshi
'అంగన్ వాడీల తొలగింపు అమానుషం'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అంగన్ వాడీల తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ...  సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారనే అక్కసుతో ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. వీడియో సీడీలు, ఫొటోల ఆధారంగా ఉద్యోగులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించడం అత్యంత అమానుషమైన చర్య అని ఆమె అభివర్ణించారు. అంగన్ వాడీలపై ప్రతీకారం తీర్చుకోవడం బాధాకరమని.. అత్తెసరు జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న నిరుపేద అంగన్ వాడీలను ఉద్యోగుల నుంచి తొలగించడం దుర్మార్గమని రోజా చెప్పారు.

తహశీల్దార్ వనజాక్షి విషయంలో చంద్రబాబు కుటిలనీతిని ప్రదర్మించారని, రిషితేశ్వరి మరణానికి బాధ్యుడైన ప్రిన్సిపల్ను చంద్రబాబు కాపాడరని రోజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాజాగా జీతాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించడంతో మహిళలంటే చంద్రబాబుకు ఎంత లోకువో  అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. ఉద్యోగాల తొలగింపు ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగన్ వాడీల తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని రోజా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు