'అర్థం కాకూడదని ఇంగ్లీషులో చదివారు'

10 Mar, 2016 15:21 IST|Sakshi
'అర్థం కాకూడదని ఇంగ్లీషులో చదివారు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. బడ్జెట్ లో అన్ని వర్గాలను మోసం చేశారని, అంకెలకు వాస్తవాలకు పొంతన లేదని అన్నారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనీసం రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని, బడ్జెట్ లో చాలా తక్కువ కేటాయించారని చెప్పారు. నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మహిళలకు మొండిచేయి చూపారని వాపోయారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు.

ప్రజలకు ఎక్కడ అర్థమవుతుందోనని బడ్జెట్ ను మంత్రి యనమల రామకృష్ణుడు ఇంగ్లీషులో చదివారని ఎద్దేవా చేశారు. నయవంచన బడ్జెట్, ప్రజలకు ద్రోహం చేసే బడ్జెట్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె. శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా తదితరులు మీడియాతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు