అధ్యక్షా.. శుభాకాంక్షలన్నా చెప్పారా!

9 Mar, 2016 02:24 IST|Sakshi
అధ్యక్షా.. శుభాకాంక్షలన్నా చెప్పారా!

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యాఖ్య
 
 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. మంగళవారం జీరోఅవర్‌లో కల్పన మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో ఈవేళ(మంగళవారం) మహిళలకే ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని అంటూ.. స్పీకర్‌గా ఉన్న తమరు కూడా ఇంతవరకూ శుభాకాంక్షలన్నా చెప్పలేదు అధ్యక్షా అని గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళా సాధికార సంస్థ చిరునామా కూడా ఎక్కడుందో తెలియట్లేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కాల్‌మనీ పేరిట మహిళలను సెక్స్‌రాకెట్‌లోకి దించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

 నీళ్లివ్వండి మహాప్రభో: కళావతి
 గిరిజన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గ ప్రజలు తాగునీటికోసం పడుతున్న ఇక్కట్లను పరిష్కరించాల్సిందిగా ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వి.కళావతి శాసనసభలో డిమాండ్ చేశారు. జీరోఅవర్‌లో ఆమె తన నియోజకవర్గ ప్రజల ఇక్కట్లను సభ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటికోసం జిల్లా కలెక్టర్‌ను ఎప్పుడు నిధులడిగినా లేవంటున్నారని, కనీసం ట్యాంకర్ల ద్వారానైనా సరఫరా చేయించాలని విజ్ఞప్తి చేశారు.

గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని ఏరియా ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య దుస్థితిని వైద్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శానిటేషన్ కాంట్రాక్టర్లకు నిధులిచ్చి ఆస్పత్రులను శుభ్రంగా ఉంచాలని కోరారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే జి.సత్యనారాయణ తన నియోజకవర్గంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాత పెన్షన్ విధానంలోని సమస్యలను ప్రస్తావించారు. గతంలో నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగాలివ్వాలని కోరారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు కూడా పలు సమస్యలను ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు