గ్రేటర్‌లో పోటీ చేయడం లేదు

14 Jan, 2016 04:21 IST|Sakshi
గ్రేటర్‌లో పోటీ చేయడం లేదు

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనందున గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తెలంగాణలో, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అసంఖ్యాకంగా ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
 ప్రకటన పూర్తి పాఠం ఇదీ..
హామీల అమలులో అధికార టీఆర్‌ఎస్ వైఫల్యం, రీ డిజైనింగ్ పేరిట సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎడతెగని జాప్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో అవరోధాలు, ఆరోగ్యశ్రీ అందక పేదల అవస్థలు వంటి ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేసింది. ఇక తెలుగుదేశం పార్టీ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి, దాన్నుంచి బయటపడేందుకు టీఆర్‌ఎస్‌తో సంధి కుదుర్చుకుంది.
 
  ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తోంది. భవిష్యత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా అవతరించడానికి సంస్థాగతంగా బలమైన యంత్రాంగాన్ని నిర్మించుకుంటోంది. అందులో భాగంగానే గ్రామం, పట్టణం, నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది.
 
  సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఒక లోక్‌సభతో పాటు మూడు శాసనసభ స్థానాలను గెలుచుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం ముమ్మరంగా కృషి చేశారు. తెలంగాణ నుంచి కరువును తరిమికొట్టడానికి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకునేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు.
 
  దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నత చదువులకు వెళ్లలేక చతికిలపడుతున్న పేద కుటుంబాల విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి లక్షల మందికి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎం సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించారు. అందువల్లే తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దివంగత నేత మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. తెలంగాణ యావత్తు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంపై పార్టీ దృష్టి సారించింది. ఏపీలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తున్న టీడీపీ, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బీజేపీ, పొరుగునే ఉన్న కర్ణాటక  ప్రభుత్వ మద్దతుతో కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంతైనా డబ్బు ఖర్చు చేసేందుకు ఈ పార్టీలు వెనుకాడటం లేదు.
 
 గ్రేటర్‌లో అసంఖ్యాకంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మద్దతుదారులతో కలసి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా నిమగ్నమైంది. అందువల్లే వచ్చేనెల 2న జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయం తీసుకుంది. 2009లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీకి దిగని విషయం తెలిసిందే. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైన సమయంలో అండగా ఉండేందుకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ క్షణం కూడా వెనుకాడదు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటంలో ముందుంటామని ప్రతిన చేస్తున్నాం.
 

మరిన్ని వార్తలు