ఫిరాయింపులపై 7న విపక్షం ధర్నాలు

5 Apr, 2017 01:38 IST|Sakshi
ఫిరాయింపులపై 7న విపక్షం ధర్నాలు

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ నిరసనలు
- అప్రజాస్వామిక, అనైతిక రాజకీయాలను ఖండించాలి  
- రాజ్యాంగంపై గౌరవమున్న పార్టీలు, సంఘాలు కలసి రావాలి
- రాష్ట్రంలో బాహాటంగానే రాజ్యాంగ ఉల్లంఘనలు
- 2, 3 రోజుల్లో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తాం: వైవీ సుబ్బారెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ టికెట్‌పై ఎన్నికల్లో గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించడం అప్రజాస్వామికం, అనైతికం అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. చంద్రబాబు చర్యలకు నిరసనగా ఈ నెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాజ్యాంగంపై గౌరవమున్న అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని కోరారు. అధికార పార్టీ అనైతిక చర్యలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

జాతీయ స్థాయికి తీసుకెళ్తాం..
వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని వైవీ సుబ్బారెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో బాహాటంగానే కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు, అప్రజాస్వామిక పోకడలను జాతీయ స్థాయికి తీసుకెళతామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి, రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని భావించే అన్ని పార్టీల నేతలనూ కలిసి, వారి మద్దతును కూడగడతామన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఎండగడతామని తెలిపారు.

రాజీనామాలంటూ లీకులా!
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఫిరాయింపుదారులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్లు లీకులు ఇచ్చారని సుబ్బారెడ్డి చెప్పారు. నిజంగా వారు రాజీనామాలు చేసి ఉంటే, వాటిని ఆమోదింపజేసుకొని తాజాగా ప్రజాతీర్పును కోరాలని డిమాండ్‌ చేశారు. ఫిరాయింపుదారుల రాజీనామా అనేది మరో డ్రామా అని మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164(1) ప్రకారం మంత్రులను నియమించే విషయంలో ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్‌ వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి సలహా ఇచ్చినా ఉచితానుచితాలు, న్యాయాన్యాయాలు బేరీజు వేసుకున్న తరువాతే దానిని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. చంద్రబాబు కొనసాగిస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నెల 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామన్నారు.

వెంకయ్యనాయుడు జవాబివ్వాలి
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం నైతికమో లేక అనైతికమో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేయాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఒక రాజకీయ పార్టీకి ఏదో జరిగిందని ప్రత్యేక చట్టం చేయాలా? అని వెంకయ్య చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇది తమ ఒక్క పార్టీ విషయంలోనే జరగలేదని, దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఫిరా యింపుల నిరోధక చట్టానికి సవరణ చేయాలని తమ పార్టీ ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతోందని చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదానికి ఒక గడువు నిర్దేశించాలని కోరినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు