హామీలపై ఇన్ని అబద్ధాలా!

7 Sep, 2017 03:46 IST|Sakshi
హామీలపై ఇన్ని అబద్ధాలా!
ఇదేం తీరు సీఎం గారూ!.. వాగ్దానాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చానంటారా?
 
సాక్షి, హైదరాబాద్‌: ఇంతలా కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఎన్నో అలవిమాలిన హామీలిచ్చి మభ్యపుచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇపుడు ఆ హామీలపై ఆడుతున్న అబద్ధాలు చూసి రాష్ట్రప్రజలు నిర్ఘాంతపోతున్నారని వ్యాఖ్యానించింది. హామీలపై చంద్ర బాబు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని, ప్రజలను మోసం చేస్తున్న తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తేదీలు, ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వేర్వేరుగా జరిగిన విలేకరుల సమావేశాలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పలు వివరాలను వెల్లడించారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాతనే.. చంద్రబాబు పూర్తి స్పృహలో ఉండే అన్ని హామీలూ ఇచ్చారని, రెండు తెలుగు రాష్ట్రాలకూ వేర్వేరుగా మేనిఫెస్టోలనూ విడుదల చేశారని వారు వివరించారు. ‘2014 మార్చి 1న రాష్ట్ర విభజన చట్టం గెజిట్‌ విడుదల కాగా చంద్రబాబు మార్చి 31న రెండు మేనిఫెస్టోలను విడుదల చేశారు. అందులో వందలాది హామీలను పొందుపరిచారు. ఇపుడు మూడున్నరేళ్లు పూర్తయిన తర్వాత ఆ హామీలన్నిటికీ తిలోదకాలివ్వడమే కాక తాను ఉమ్మడి రాష్ట్రంలో ఆ హామీలిచ్చానని బొంకుతున్నారు’ అని వారు ఎద్దేవా చేశారు. అంతేకాదు చంద్రబాబు ఇచ్చిన అలవిమాలిన హామీలను చూసి అనుమానమొచ్చిన ఎన్నికల కమిషన్‌ ఆ హామీలెలా అమలు చేయబోతున్నారంటూ ఓ నోటీసు ఇచ్చింది.

ఆ నోటీసుకు ఏప్రిల్‌ 11న చంద్రబాబు ఐదుపేజీల సమాధానం కూడా రాసి పంపారు. ఆ హామీలన్నీ తాను స్పృహలో ఉండే ఇచ్చానని, ఆ హామీల వల్ల పడే ఆర్థిక ప్రభావం గురించి కూడా తనకు తెలుసునని, కులమతాల పట్టింపు లేకుండా అందరికీ ఆ హామీలు అమలు చేస్తామని,  మేనిఫెస్టోలోని హామీలన్నిటినీ అమలు చేయగలమన్న నమ్మకం తమకు ఉందని ఆ లేఖలో చంద్ర బాబు ఎన్నికల కమిషన్‌కు రాశారు. ప్రజలకు ఏవీ గుర్తుండవని, అన్నీ మరచిపోతారని ఆయన అనుకుంటున్నారని, కానీ అందరికీ అన్నీ గుర్తున్నాయని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిం చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అందరికీ ఆదర్శంగా ఉండడానికి బదులు పట్టపగలు ఇలా ఘోరంగా అబద్దాలాడడం మునుపెన్న డూ ఎరగమంటూ ప్రజలు ఛీత్కరిస్తున్నారని వారు పేర్కొన్నారు. 
 
విభజన తర్వాతే టీడీపీ మేనిఫెస్టోలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హామీలిచ్చానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందింది. మార్చి ఒకటో తేదీన రాష్ట్రపతి సంతకం పూర్తయి కేంద్ర ప్రభుత్వం గెజెట్‌లో వెలువడింది. చంద్రబాబు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను మార్చి 31న విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా మేనిఫెస్టోలను బాబు విడుదల చేశారు. టీడీపీ నేతలు ముద్దు కృష్ణమ నాయుడు (ఏపీ), రావుల చంద్రశేఖరరెడ్డి (తెలంగాణ)ని చెరోవైపు నిలబెట్టుకుని ఫొటోలు కూడా తీయించుకున్నారు. నిజాలు ఇంత నిఖార్సుగా ఉంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు హామీలిచ్చానని చంద్రబాబు ఎలా అబద్ధాలు చెబుతారు?.

ఈ హామీల అమలు ఎలా సాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఒకరు లేఖరాస్తే.. ఎన్నికల సంఘం కూడా టీడీపీని వివరణ కోరింది. ఏప్రిల్‌ 11న టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖలో తాము ఆర్థిక పరమైన అంశాలన్నీ అంచనావేసి పరిస్థితులు బేరీజు వేసుకున్నామని, ఆ తర్వాతే రైతుల రుణాలు మాఫీ చేస్తామని బాబు చెప్పారు. అయినా ప్రజలను ఇంకా మోసపుచ్చుతున్నారు. 
 
ప్రధాన హామీలపై ఊరూవాడా ప్రచారం 
రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నెలకు రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి, బెల్టుషాపుల రద్దు, కాపులకు రిజర్వేషన్‌.. ఏపీకి ప్రత్యేక హోదా... వంటి హామీలపై ఊరూవాడా ఫ్లెక్సీలు వాటికి లైట్లు.. గోడలపై రాతలు.. టీవీల్లో ప్రకటనలతో  హోరెత్తించారు. ఎన్నికల సభల్లో చంద్రబాబు ఊదరగొట్టారు. పాంప్లేట్లు వేసి మరీ ఇంటింటికీ పంచారు. ఇదంతా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతనే.. ఎన్నికల ప్రచారంలోనే ఈ హామీలన్నీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిందనీ, 
 
జూన్‌ 2నుంచి రెండూ వేర్వేరు రాష్ట్రాలుగా ఉంటాయని అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మూడున్నరేళ్లు పొద్దుపుచ్చి హామీలన్నీ తుంగలో తొక్కి ఇపుడు అలా అనుకోలేదని, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చానని అబద్దమాడుతుండడంపై ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. ఆర్ధిక అంశాలన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే హామీలిచ్చానని ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన చంద్రబాబు ఇపుడు మాటమార్చి.. ఆదాయం వస్తుందనుకుని హామీలిచ్చానని వ్యాఖ్యానిస్తుండడం చూసి విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

 
నాడు..
‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థికపరమైన అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలకు వేర్వేరు మేనిఫెస్టోలను విడుదల చేశాం. అన్ని కులాల సమస్యలను తీరుస్తాం.. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం.. వాల్మీకులను ఎస్టీలలో చేరుస్తాం..’’
–ఎన్నికల సంఘానికి రాసిన లేఖ, మేనిఫెస్టోలోనూ చంద్రబాబు చెప్పిన మాటలివి.
 
నేడు..
‘‘హామీలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినవి... ఆదాయం వస్తుందనుకున్నాం.. ప్రతిపక్షాలవారు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు..’’
– తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్‌లో చంద్రబాబు వ్యాఖ్యలివి..