ఉగ్రవాద రహిత దేశమే లక్ష్యం

7 Jul, 2014 02:52 IST|Sakshi
ఉగ్రవాద రహిత దేశమే లక్ష్యం

 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు
 
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ఉగ్రవాద రహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ఎజెండా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం ఉందని చెప్పారు. వరుసగా ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించేందుకు సమష్టి కృషి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీ శక్తుల నుంచే కాకుండా, స్వదేశీ శక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టాలని సూచించారు. జాతీయ భద్రత అనే అంశంపై హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో ఐదు రోజుల పాటు జరిగే సదస్సును మంత్రి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనలో యువ ఐపీఎస్‌లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులను సమర్థంగా ఎదుర్కొనేలా ఆలోచించాలని సూచించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అదుపు చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత దేశానికే ఆదర్శప్రాయమని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌పీఏ ఇస్తున్న శిక్షణ, అందిస్తున్న క్రమశిక్షణ అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు