ఇండోనేసియాలో భూకంపం

30 Jul, 2018 02:41 IST|Sakshi
బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

14 మంది మృతి

160 మందికిపైగా గాయాలు

రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత

జకార్త: ఇండోనేసియాలోని ప్రముఖ పర్యాటక దీవి లోంబోక్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో 14 మంది మృతి చెందారు. 160 మందికిపైగా గాయపడ్డారు. వెయ్యికిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైంది. మరో ద్వీపం బాలిలో కూడా స్వల్పంగా భూకంపం సంభవించింది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ‘తూర్పు లోంబోక్‌ జిల్లాలోనే 10 మంది వరకు మృతి చెందారు. అందులో ఓ మలేసియన్‌ పర్యాటకుడు కూడా ఉన్నాడు.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వివరాలు అందాల్సి ఉంది. కనీసం 162 మంది గాయపడ్డారు. అందులో 67 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు’అని డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఏజెన్సీ అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన సమయంలో మౌంట్‌ రింజని నుంచి భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడినట్లు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని స్థానిక అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలు చోటుచేసుకున్న ప్రాంతంలో భవనాలు ఎక్కువ లేకపోవడం, మైదాన ప్రాంతం కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
 

మరిన్ని వార్తలు