షాకింగ్‌ విషయాలు వెల్లడించిన యునెస్కో నివేదిక

13 Jul, 2020 15:48 IST|Sakshi

10 మిలియన్ల మంది పిల్లలు శాశ్వతంగా చదువుకు దూరం

పారీస్‌: కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్‌ కట్టడి కోసం దేశాలన్ని లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థికంగా ఇప్పటికే ఎంతో నష్టాన్ని చవి చూస్తున్నాయి. అయితే కరోనా వల్ల ఆర్థికంగానే కాక విద్యాపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లిందని సేవ్‌ ది చిల్డ్రన్ సంస్థ‌ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో దాదాపు 1.6 బిలియన్‌ మంది పిల్లలు పాఠశాలకు, యూనివర్సిటీలకు దూరమయ్యారని సంస్థ‌ తెలిపింది. ఒక తరం మొత్తం పిల్లల చదువు పాడవ్వడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అన్నది. యునెస్కో డాటాను ఆధారంగా చేసుకుని సేవ్‌ ది చిల్డ్రన్‌ ఓ నివేదిక వెల్లడించింది. ఫలితంగా 90-117 మిలియన్ల మంది పిల్లలు పేదరికంలోకి నెట్టబడతారని నివేదిక అంచనా వేసింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక నష్టాలను భరించడం కోసం చాలా మంది పిల్లలు బలవంతంగా పనులకు వెళ్లాల్సి వస్తుందని.. బాల్య వివాహాల సంఖ్య పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అంతేకాక దాదాపు 9.7 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని నివేదిక తెలిపింది. 

అంతేకాక 2021 నాటి అన్ని దేశాల బడ్జెట్లలో విద్యకు కేటాయింపులు భారీగా తగ్గుతాయని.. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం 77 బిలియన్ల అమెరికన్‌ డాలర్లుగా ఉంటుందని సేవ్‌ ది చిల్డ్రన్‌ నివేదిక అంచాన వేసింది. అంతేకాక ఈ చర్యల వల్ల పేద-ధనిక, ఆడ-మగ అంతరాలు మరింత పెరుగుతాయన్నది. దీని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వాలు, దాతలు పిల్లలందరికి సురక్షితమైన, నాణ్యమైన విద్యనందించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరింది. ఇప్పటికే పేద, అట్టడుగు వర్గాల పిల్లలు సగం విద్యా సంవత్సరం నష్టపోయారని నివేదిక తెలిపింది. విద్యా కార్యక్రమాల కోసం దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు 77 బిలియన్‌ డాలర్లు కేటాయించాల్సి వస్తుందని  నివేదిక అంచనా వేసింది.

ఈ విద్యా సంక్షోభం ముగియకపోతే.. పిల్లల భవిష్యత్తుపై ఆ ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని సేవ్‌ ది చిల్డ్రన్ తెలిపింది. 2030 నాటికి పిల్లలందరికి నాణ్యమైన విద్య అందించాలనే ఐక్యరాజ్యసమితి వాగ్దానం పూర్తికాదని తెలిపింది. 12 దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు నివేదిక వెల్లడించింది. నైజర్, మాలి, చాడ్, లైబీరియా, అఫ్ఘనిస్తాన్, గినియా, మౌరిటానియా, యెమెన్, నైజీరియా, పాకిస్తాన్, సెనెగల్‌, ఐవరీ కోస్ట్ దేశాల పిల్లలు చాలా వెనకబడిపోయే ప్రమాదం ఉందని సేవ్‌ ది చిల్డ్రన్ నివేదిక హెచ్చరించింది.

మరిన్ని వార్తలు