పిట్ట కొంచెం.. ఘనత ఘనం..

19 Nov, 2015 18:38 IST|Sakshi
పిట్ట కొంచెం.. ఘనత ఘనం..

పిట్టకొంచెం కూత ఘనం అన్న మాటను నిజం చేస్తోందా చిన్నారి. కేవలం పదేళ్ళ వయసులోనే రచయిత, వక్త, రస్కిన్ బాండ్, నర్తకి, గాయకురాలుగా పలు కళల్లో ఆరితేరిపోయి.. తన ప్రత్యేకతను చాటుతోంది. ఖాళీ సమయాల్లో బాస్కెట్ బాల్ ఆడటం, మంచి పుస్తకాలను చదవడం ఆమె హాబీలు.. ఇప్పటికే సకల కళా వల్లభురాలుగా గుర్తింపు పొందిన ఆమె... ప్రస్తుతం న్యూయార్క్ లోని 'టెడ్ ఎక్స్'  కాన్ఫరెన్స్ లో మాట్లాడి.. అతి చిన్న వయసులో తన కీర్తి  కిరీటానికి మరో ప్రత్యేకతను జోడించింది.

పూనె బలెవాడి విబ్ గ్యోర్ హై విద్యార్థి.. పదేళ్ళ ఇషితా కత్యాల్ భారత్ కు చెందిన అతి చిన్న వ్యాఖ్యాతగా పేరొందింది. టెడెక్స్ సమావేశంలోని చర్యలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సమావేశంలో అదే వయసుకు చెందిన వారిని తరచుగా అడిగే ప్రశ్నల్లో భాగంగా  'మీరు ఏమి అవుదామనుకుంటున్నారు?' (what do you want to be now?) అన్న ప్రశ్నకు విభిన్నంగా స్పందించి, అనర్గళంగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంది. నాలుగు నిమిషాల నిడివిలో ఆమె మాట్లాడిన ప్రతి మాటా వ్యవస్థకు సవాలుగా మారింది.

2013 లో టెడెక్స్ పూనెలో నిర్వహించిన తొలి సమావేశానికి హాజరవ్వడంతో ఈ యువ స్పీకర్ ఇషిత ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో ఆ కార్యక్రమం అమెను ఎంతో ఆకట్టుకోవడంతో వెంటనే నిర్వాహకులను కలిసి ఆ జట్టులో సభ్యత్వం నమోదు చేసుకుంది. తన అభిరుచితో ప్రత్యేకంగా టెడెక్స్ యూత్@బలెవాడి కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరినో ఆకట్టుకుంది. ఎనిమిదేళ్ళ వయసులో అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన అతి చిన్న వయస్కురాలుగా అప్పట్లోనే ప్రత్యేక గుర్తింపు పొందింది.

వయసుతో సంబంధం లేకుండా పిల్లలు వారి కలలను సాకారం చేసుకోవచ్చు అనేందుకు ఎంతోమంది చిన్నారుల్లో ఇషిత తాజా చర్చ  ప్రేరణ కల్పించింది. అతి చిన్న వయసు నుంచే అసాధారణ ప్రతిభను చూపుతూ ఇషిత ప్రత్యేకతను సాధించుకుంటోంది. ఓ రచయితగా ఉండాలని కోరుకున్న ఆమె... ఎనిమిది సంవత్సరాల వయసులోనే 'సిమ్రాన్ డైరీ' పుస్తకాన్ని రాసి ఆకట్టుకుంది. వేసవి సెలవులను వినియోగించుకొని పిల్లల మనసులో ప్రవేశించే విషయాలను వారు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అన్న విషయంపై రాసిన ఆమె పుస్తకం... మొదట్లో ఆమెజాన్ క్లిండ్ స్టోర్ లోనూ, అనంతరం పార్ట్ రిడ్జ్ పబ్లిషర్స్ లో ప్రచురితమైంది.

''స్కూలు హోంవర్స్ లు, టెడెక్స్ కార్యక్రమాలు, రచనలు ఇలా ప్రతిది నిర్వహించడం మొదట్లో నాకు కాస్త కష్టంగా అనిపించేది. అప్పట్లో నేను ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేదాన్ని. కొన్నిసార్లు హోంవర్క్ చేయడానికి సమయం మిగిలేది కాదు. అప్పట్లో మా నాన్నగారు అన్ని పనులూ పూర్తవ్వాలంటే ఉదయం మేల్కొనే సమయాన్ని మార్చమని సూచించారు. ఆ తర్వాత ఐదు గంటలకే లేవడం ప్రారంభించాను. లేచిన వెంటనే ఆరోజు చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ చేసుకొని చేయడం ప్రారంభించాను'' అంటూ తన కార్యసాధనకు వెనుక కష్టాన్ని, పట్టుదలను వివరిస్తోంది ఇషిత. అయితే ఇషిత తాజా న్యూయార్క్ స్పీచ్ ఇంకా విడుదల కాలేదు.

మరిన్ని వార్తలు