ఔరా.. ఔల్‌.. 

20 Feb, 2018 03:27 IST|Sakshi

నగర రోడ్లపై ఓ కారు కేవలం రెండే రెండు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుంటే ఎలాగుంటుంది? ఇదిగో ఈ కారులాగా ఉంటుంది. సాధారణ ఫార్ములా వన్‌ రేసు కార్లే వంద కిలోమీటర్ల వేగం అందుకోవడానికి 2.1 నుంచి 2.7 సెకన్ల సమయం పడుతోంది. అలాంటిది ఈ కారు కరెక్టుగా చెప్పాలంటే 1.921 సెకన్లలో 96.56 కిలోమీటర్ల వేగాన్ని అందుకుందట! అలాగని ఫార్ములా వన్‌ తరహాలో ఇది రేసు కారు కాదు.. నగర రోడ్లపై తిరిగేందుకు అనువుగా రూపొందించిన కారు. ‘ఔల్‌’ అనే ఈ ఎలక్ట్రిక్‌ కారును జపాన్‌కు చెందిన అస్పార్క్‌ కంపెనీ తయారుచేసింది.

నగర రోడ్లపై తిరగడానికి అనువుగా ఉన్న కార్లలో ఇంతటి వేగం దేనికీ సాధ్యం కాదని.. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వాహనంగా ‘ఔల్‌’ రికార్డుకెక్కుతుందని సదరు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 860 కిలోల బరువున్న ‘ఔల్‌’ 430 హార్స్‌పవర్‌ సామర్థ్యం కలిగి ఉంది. ఒకసారి చార్జ్‌ చేస్తే.. 150 కిలోమీటర్లు వరకు వెళ్తుంది. గతేడాది జర్మనీలో జరిగిన ఆటో షోలో దీన్ని తొలిసారిగా ప్రదర్శించారు. తాజాగా దీని వేగానికి సంబంధించిన వీడియోను సదరు కంపెనీ విడుదల చేసింది. 50 వాహనాలను మాత్రమే అస్పార్క్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తుందట. ఒక్కోదాని ధర రూ. 27 కోట్లు. అయితే.. టెస్టింగ్‌ వీడియోపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెస్టింగ్‌లో పాల్గొన్న కారుకు రేసు కారు టైపు టైర్లను వాడారని.. రోడ్లపై తిరిగే కార్ల తరహా టైర్లను వాడి.. అప్పుడు పరీక్ష చేపట్టాలని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు