కరోనా: దారిద్య్రంలోకి పది కోట్ల మంది

30 Apr, 2020 15:39 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా మురికి వాడల్లో నివసిస్తోన్న ప్రజల్లో దాదాపు పది కోట్ల మంది ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే రక్షిత మంచినీరు, సరైన మురికి పారుదల వ్యవస్థ లేకుండా అనారోగ్యానికి గురవుతున్న వారి పరిస్థితి మరింత దుర్భరం అవుతుందని ప్రపంచ బ్యాంక్‌కు చెందిన పట్టణ పరిస్థితులపై అవగాహన కలిగిన నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల మురికి వాడల నుంచి వచ్చే పన్ను వసూళ్లు కూడా 15 నుంచి 25 శాతానికి పడి పోతాయి కనుక ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం పట్టణ కార్పొరేషన్లకు ఉండే అవకాశం కూడా లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల కడు పేద ప్రజలు, నిత్య దరిద్రులు ప్రధానంగా దెబ్బతింటారని ప్రపంచ బ్యాంక్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ సమేహ్‌ వాహ్‌బా తెలిపారు. వీరింత ఉపాధి కోల్పోవడం వల్లనే రోడ్డున పడతారని ఆయన హెచ్చరించారు. ఎక్కడైతే కామన్‌ మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారో, ఎక్కడైతే భౌతిక దూరం పాటించడం అసాధ్యమో ఆ ప్రాంతాలను శాటిలైట్‌ సహాయంతో మ్యాపింగ్‌ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే భారత్‌లోని ముంబై నగరంతోపాటు కైరో, కిన్‌షాసా నగరాలను మ్యాపింగ్‌ చేసినట్లు ఆయన చెప్పారు. (వరల్డ్‌ వార్‌ హీరో శత జయంతి)

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కోట్ల మందికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆహారం, ఆర్థిక సహాయం అందడం లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త శీలా పటేల్‌ తెలియజేశారు. మురికి వాడల్లో నివసించే నిరాశ్రుయుడివైనా లేదా ఫుట్‌పాత్‌లపై పడుకునే వ్యక్తయినా వలస కార్మికుడివి అయితే చాలు ఎలాంటి రేషన్‌ లేదా ఆర్థిక సహాయం అందడం లేదని భారత మానవ హక్కుల సంఘానికి చెందిన శీలా పటేల్‌ ఆరోపించారు. పలు ప్రాంతాల్లో మురికి వాడల్లోని స్వరాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకే అక్కడి స్థానిక ప్రభుత్వాలు సతమతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి: వియత్నాం యుద్ధాన్ని మించి..

మరిన్ని వార్తలు