ఇజ్రాయెల్‌ పునాదికి వందేళ్లు!

2 Nov, 2017 04:04 IST|Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన యూదులకు సొంత రాజ్యం పేరుతో 1948 మే 23న ఇజ్రాయెల్‌ ఏర్పాటుకు ఊతమిచ్చిన ‘బేల్ఫర్‌ ప్రకటన’కు గురువారంతో వందేళ్లు నిండుతున్నాయి. ప్రత్యేక దేశం కావాలన్న యూదుల ఆకాంక్షకు ఇంగ్లండ్‌ మద్దతుకు హామీ ఇస్తూ బ్రిటన్‌ విదేశాంగమంత్రి ఆర్థర్‌ బేల్ఫర్‌ 1917 నవంబర్‌ 2న బేల్ఫర్‌ డిక్లరేషన్‌ విడుదల చేశారు. బేల్ఫర్‌ ప్రకటన నాటికి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. బ్రిటన్‌ వ్యతిరేక శిబిరంలోని ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో అంతర్భాగమైన పాలస్తీనా ప్రాంతం ఈ యుద్ధంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ నాయకత్వంలోని మిత్రదేశాల కూటమి ఆక్రమణలోకి వచ్చింది. అప్పటికే అనేక మంది కుబేరులకు జన్మనిచ్చిన యూదు జాతి నుంచి యుద్ధానికి విరాళాలు, ఆర్థికసాయం సంపాదించే లక్ష్యంతో ఇంగ్లండ్‌ ఇజ్రాయెల్‌ స్థాపనకు అనుకూలంగా ఈ ప్రకటన చేసింది. బేల్ఫర్‌ డిక్లరేషన్‌ విడుదలైన నాటి నుంచి పాలస్తీనా ప్రాంతానికి ఇతర దేశాల నుంచి యూదుల వలస ఊహించని స్థాయిలో ఊపందుకుంది.

ఇజ్రాయెల్‌ పునాదికి వందేళ్లు!
1947 నవంబర్‌ 29న ఐరాస తీర్మానం 181 ప్రకారం కొత్తగా ఏర్పడే ఇజ్రాయెల్‌లో యూదులకు 55 శాతం భూభాగాన్ని కేటాయించారు. వాటిలో పాలస్తీనా అరబ్బులు మెజారిటీగా ఉన్న విలువైన మధ్యధరా సముద్రతీర నగరాలున్నాయి. నిజానికి జనాభాలో యూదుల వాటా అప్పటికి మూడో వంతు మాత్రమే. వారి చేతుల్లో ఆరు శాతం కన్నా తక్కువ భూములున్నాయి. దీంతో పాలస్తీనీయులు ఐరాస తీర్మానాన్ని తిరస్కరించారు. వెంటనే పాలస్తీనా అరబ్బులకు, యూదుల జియోనిస్ట్‌ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో అరబ్బుల ఆస్తి, ప్రాణనష్టం విపరీతంగా జరిగింది. రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ సేనలతో కలిసి పోరాడిన అనుభవం యూదులకు కలిసొచ్చింది. పాలస్తీనాలో పాలనా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు 1948 మే 15న బ్రిటన్‌ ప్రకటించింది.

అదే నెల 23న యూదుల సొంత దేశం పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్‌గా అవతరించింది. అప్పటి నుంచి యూదు జాత్యహంకార ప్రభుత్వాల హింస ఫలితంగా పాలస్తీనా అరబ్బులు లక్షలాది మంది ఇతర దేశాలకు వలసపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోటీ 24 పాలస్తీనీయులుండగా, యూదుల ఆధిపత్యంలో జాతి వివక్ష అమలవుతున్న ఇజ్రాయెల్‌లో వారి సంఖ్య నేడు దాదాపు 17 లక్షల(20%)కు పడిపోయింది. యూదుకు సొంత రాజ్యం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ ఏడు దశాబ్దాలుగా పాలస్తీనీయులు సొంత పాలన కోసం పోరాడుతూనే ఉన్నారు. పాలస్తీనా విమోజన సంస్థ నేత యాసిర్‌ అరాఫత్‌ నాయకత్వాన 1994లో పాలస్తీనా అథారిటీ పేరిట పరిమిత అధికారాల ‘సర్కారు’ను సాధించారు. సంపూర్ణ స్వరాజ్యం వారికి కనుచూపు మేర కనిపించడం లేదు. వందేళ్ల క్రితం బ్రిటన్‌ ‘బేల్ఫర్‌ డిక్లరేషన్‌’మూడు దశాబ్దాలకే యూదులకు సొంత రాజ్యం అందించిందిగాని అక్కడి మెజారిటీ పాలస్తీనీయులకు సొంత దేశం లేకుండా పోయింది.  

మూడు శాతం నుంచి 75 శాతానికి పెరిగిన యూదుల సంఖ్య!
మొదటి ప్రపంచయుద్ధకాలంలో ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమయ్యాక పశ్చిమాసియా ప్రాంతాన్ని ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ పంచుకున్నాయి. 1920లో పాలస్తీనా తన పాలనలోకి రావడానికి ముందే తనదికాని ఈ భూభాగాన్ని యూదుల పరం చేస్తామని బేల్ఫర్‌ ప్రకటన ద్వారా బ్రిటన్‌ వారిని ఆకట్టుకుంది. ఈ ప్రకటన తర్వాత అంతకుముందు ఉగాండా, అర్జెంటీనాలో ఏదోఒక చోట యూదు రాజ్యం స్థాపన జరుగుతుందనుకున్న ఈ జాతి జనం ‘ఇజ్రాయెల్‌’వైపునకు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు. 1880ల్లో పాలస్తీనాలోని స్థానిక యూదుల జనాభా మూడు శాతం మాత్రమే. బేల్ఫర్‌ ప్రకటనతో వరదలా వచ్చిపడిన విదేశీ యూదుల్లో ఇజ్రాయెల్‌ స్థాపనే బలమైన ఆకాంక్ష. 1922–33 మధ్య యూదుల సంఖ్య మొత్తం పాలస్తీనా జనాభాలో 9 నుంచి 27 శాతానికి పెరిగింది. బ్రిటన్‌ సర్కారు అండతో ధనిక యూదులు పాలస్తీనీయుల భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. జర్మనీలో నాజీల పాలనలో ఎదురైన వేధింపుల వల్ల 1933–36 మధ్య దాదాపు 60 వేల యూదులు దేశం వదలి పాలస్తీనా చేరుకున్నారు.

మరిన్ని వార్తలు