నీటి కటకట.. ఒంటెల కాల్చివేత

9 Jan, 2020 04:01 IST|Sakshi

ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం

సిడ్నీ: కరవుతో అల్లాడుతున్న ఆస్ట్రేలియాలో నీళ్లు ఎక్కువగా తాగే పదివేల ఒంటెలను కాల్చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. నీళ్లకోసం వెంపర్లాడుతున్న ఈ మూగజీవాలు గుంపులుగా మానవ ఆవాసాల వద్దకు వచ్చేస్తున్నాయని, ఫలితంగా అక్కడి గిరిజన తెగల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది.

భారీ సంఖ్యలో ఉండే ఒంటెల మందలు నీటి కోసం వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయని, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా.. ఆహారం, నీళ్లను వాడేస్తున్నాయని దక్షిణ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. ఆస్ట్రేలియాలో కనివినీ ఎరుగని రీతిలో వేడి వాతావరణం కొనసాగుతూండటంతో కొన్ని చోట్ల నీళ్లు అడుగంటిపోయి కార్చిచ్చులు పెచ్చరిల్లిపోతున్న విషయం తెలిసిందే.  కరవు కారణంగా జంతువులను రక్షించుకోవడమూ కష్టమవుతోందని నీటికోసం పోటీపడే క్రమంలో కొన్ని ఒంటెలు తొక్కిసలాటలో మరణించగా... మరికొన్ని నీళ్లులేక మరణించాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నిచోట్ల మృతదేహాల కారణంగా తాగునీరు కలుషితమైన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా