ఇకపై కరోనా అని పిలవకూడదు..!

12 Feb, 2020 03:09 IST|Sakshi
చైనాలోని బీజింగ్‌ రైల్వేస్టేషన్‌లో మాస్కులు ధరించిన ప్రయాణికులు 

కరోనా మృతులు @1000

వైరస్‌ అధికారిక పేరు ‘కోవిడ్‌–19’

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

బీజింగ్‌/లండన్‌/జెనీవా: చైనాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగగా.. వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చైనా ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం మేరకు కరోనా మహమ్మారికి 1,016 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 42, 638కి చేరింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఒకటి మంగశవారం బీజింగ్‌ను చేరుకుని వైరస్‌ నిరోధక చర్యల్లో సాయం అందించడం మొదలుపెట్టిందని చైనా ఆరోగ్య కమిషన్‌  ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్‌ కారణంగా ఒక్కరోజే 108 మంది మరణించారని, 2,478 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది.

సంయుక్త బృందం ఏర్పాటు..
కరోనా వైరస్‌ను కట్టడి చేసే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందానికి చైనా అధికారులు తోడయ్యారు. ఇరువురూ సంయుక్తంగా వ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది.  ఇలా ఉండగా ఇతర దేశాల్లో కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య సోమవారానికి 350కు చేరుకోగా, కనీసం ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. యూఏఈలోని దుబాయిలో మరో భారతీయుడు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకూ ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8కి చేరుకుంది.

వ్యాక్సిన్‌ ప్రయోగాలు షురూ?
కరోనా వైరస్‌ చికిత్సకు ఒక టీకాతో జంతు పరీక్షలు మొదలుపెట్టినట్లు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు.  కొన్ని నెలల్లో తొలిదశ ప్రయోగాలు పూర్తి చేసి, మానవుల్లో టీకా సామర్థ్యంపై పరీక్షలు చేపడతామన్నారు. ఈ ఏడాది చివరికి ఇది వినియోగంలోకి రానుందన్నారు.

కరోనాతో ప్రపంచానికి ముప్పు! 
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ను తగువిధంగా కట్టడి చేయని పక్షంలో అది ప్రపంచం మొత్తానికి ముప్పుగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనోమ్‌ హెచ్చరించారు. ఈ వైరస్‌ను కట్టడి చేసే లక్ష్యంతో జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇకపై కోవిడ్‌–19 
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్‌–19’గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్‌ (జబ్బు)ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.

తల్లికి వైరస్‌.. బిడ్డ క్షేమం!
కరోనా వైరస్‌ బారిన పడ్డ ఓ మహిళ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చినట్లు చైనా  అధికారులు మంగళవారం తెలిపారు.  షాన్‌క్సీలో 33 ఏళ్ల మహిళ  2.73 కిలోల బరువున్న బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. పుట్టిన బిడ్డకు పరీక్షలు జరిపి కరోనా వైరస్‌ సోకలేదని నిర్ధారణ చేశామన్నారు.  కరోనా కారణంగా తల్లి నుమోనియాతో బాధపడుతోందన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వూహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

మరణాలు తక్కువగానే ఉంటాయేమో

ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలివి

కరోనా : ఆంక్షలు సడలించాల్సిన సమయం కాదు

కరోనా: పురుషుల సంఖ్యే అధికం.. కారణమిదే!

సినిమా

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట