కరోనా సోకి 108 ఏళ్ల వృద్ధురాలు మృతి

29 Mar, 2020 15:26 IST|Sakshi

లండన్‌ : ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ తన ఒడిలోకి చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌తో పోరాడిన 108 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం మృత్యుఒడికి చేరారు. బ్రిటన్‌కు చెందిన హిల్డా చర్చిల్ కరోనా బారినపడి.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె కరోనా వైరస్‌ సోకినట్లు నిర్థారణ అయిన 24 గంటల్లోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యూకేలో కరోనా సోకిన అత్యంత పెద్ద వయస్కురాలు హిల్డా కావడం గమనార్హం. ఏప్రిల్‌ 5న ఆమె 109వ జన్మదిన వేడుకలను జరుపుకోనునున్న తరుణంలోనే మృతి చెందడంతో.. పలువురు దేశాధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (200 కిమీ నడక.. మధ్యలోనే ఆగిన ఊపిరి)

కాగా 108 ఏ‍ళ్ల చర్చిల్‌ రెండు (1914, 1939) ప్రపంచ యుద్ధాల సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రాణాలను కాపాడుకున్నారు. అంతేకాక 1918 యూరప్‌ వ్యాప్తంగా 5 కోట్ల ప్రాణాలను బలిగొన్న స్ఫానిష్‌ ఫ్లూను సైతం ఆమె తట్టుకున్నారు. స్ఫానిక్‌ ఫ్లూ కారణంగా హిల్డా సొంత సోదరితో పాటు కుటుంబ సభ్యులను కూడా పొగొట్టుకున్నారు. కాగా బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 17000 కేసులు నమోదు కాగా.. 1000 మందికి పైగా పౌరులు మరణించారు. మరోవైపు  మహమ్మారి కరోనాకు స్పెయిన్‌ యువరాణి మారియా థెరీసా బలైన విషయం తెలిసిందే. ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. (కరోనా వైరస్‌తో స్పెయిన్‌ యువరాణి మృతి)

మరిన్ని వార్తలు