అంతరిక్ష పరిశోధకులకు కిక్కిచ్చిన బాలుడు

13 Oct, 2013 20:04 IST|Sakshi
అంతరిక్ష పరిశోధకులకు కిక్కిచ్చిన బాలుడు

 వాషింగ్టన్(పిటిఐ): అమెరికాకు చెందిన 11 ఏళ్ల బాలుడు అంతరిక్ష పరిశోధకులకు మంచి కిక్కిచ్చాడు. కిక్కేందని అనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధకులు  అంతరిక్షంలోనే  తాగే బీరు తయారుచేసే విధానాన్ని కనుగొన్నాడు. వారు అంతరిక్షంలో బీరు లేదని బాధపడవలసిన అవసరంలేదు.

11 ఏళ్ల ఈ విద్యార్థి స్పేస్ స్టేషన్‌లోనే బీర్ తయారు చేసుకునే విధానాన్ని కనుగొనడమేకాకుండా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎస్ఎస్)ను సందర్శించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. కొలరాడోలోని స్టెమ్ పాఠశాలలో ఆరో గ్రేడ్ చదువుతున్న మైకేల్ బోడ్జియానొస్కి తన క్లాసు పరిశోధనల్లో భాగంగా 15 సెంటీ మీటర్ల ట్యూబులో చిన్న సారా బట్టీని రూపొందించాడు. దానిలో బీరు తయారు చేయడానికి కావాల్సిన బార్లీ మాల్ట్, ఈస్ట్ లాంటి పదార్థాలను విడివిడిగా ఉంచే ఏర్పాటు చేశాడు. అవన్నీ కలిసేలా ఆస్ట్రోనాట్స్ ఒక్క సారి ట్యూబ్‌ను షేక్ చేస్తే కొంత సేపటికి బీర్ రెడీ అవుతుంది. దీనిని నానో రాక్స్ అనే సంస్థ త్వరలోనే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు అందించబోతోందని స్పేస్.కామ్ తెలిపింది.

కాగా, తన ప్రయోగం గొప్ప సక్సెస్ అయినందుకు బోడ్జియానొస్కి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. క్లాసులో ఫస్ట్ మార్క్ సాధించాలని ప్రయోగం మొదలుపెట్టాను తప్ప స్పేస్‌లోని వాళ్ల కోసం కాదని చెబుతున్నాడు. అంతరిక్షంలో నీటిని శుభ్రం చేయడం కన్నా ఈ విధానంలో బీర్‌ను తయారు చేయడం సులువని చెప్పాడు. అత్యవసర సమయంలో నీళ్లకు ప్రత్యామ్నాయంగా కూడా ఇది ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు